
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. దేవర 2 లో కూడా నటించాల్సివుంది. అయితే.. ఊహించని విధంగా భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇదే ఒక సర్ ఫ్రైజ్ అనుకుంటే.. దీనికి మించిన సర్ ఫ్రైజ్ మరోటి వచ్చింది. అది ఏంటంటే.. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నాడని.. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని న్యూస్ లీకైంది. దీంతో దాదాసాహేబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్, అమీర్ ఖాన్ నటించబోతుండడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఈ క్రేజీ బయోపిక్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ నటించబోతున్నాడనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కమర్షియల్ గా ఇలాంటి సబ్జెక్టులు రిస్క్ అయినప్పటికీ ఎప్పటికి నిలిచిపోయే క్లాసిక్స్ కాబట్టి ఖచ్చితంగా చేయాలనే అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వెలువడింది. ఈ కథ చెప్పగానే ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. అయితే.. ఇది ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదట. 2023 నుంచి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీనికి నిర్మాణ భాగస్వామిగా దర్శకధీరుడు రాజమౌళి ఉన్నారనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటిస్తున్నారనే వార్త హాట్ టాపిక్ గా ఉన్న టైమ్ లోనే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఫాల్కే బయోపిక్ రానుందని మరో వార్త రావడంతో అయోమయం ఏర్పడింది. ఈ బయోపిక్ తీయాలనుకోవడం మంచిదే కానీ.. ఇద్దరు స్టార్లు ఒకేసారి ఈ బయోపిక్ చేయాలనుకోవడం విచిత్రమే అని చెప్పచ్చు. అమీర్ ఖాన్ తో చేయాలనుకున్న ఈ బయోపిక్ ను అక్టోబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, అమీర్ ఖాన్ ఇద్దరూ బెస్ట్ యాక్టర్స్. పాత్ర ఏదైనా కానీ.. అదరగొట్టేస్తారు. మరి.. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎవరు ముందు వస్తారో..? ఎవరు ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి.