రచ్చకాకు ముందే జాగ్రత్త పడ్డారా?

సోషల్ మీడియాలో గుంటూరుకు చెందిన ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్‌ పెద్ద కలకలమే సృష్టించాయి. మాజీ సీఎం జగన్ సతీమణి భారతీపై కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తదనంతర పరిణామాలు అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోను చర్చకు దారి తీస్తున్నాయి. భారతిని టార్గెట్ చేస్తూ కిరణ్‌ చేసిన కామెంట్స్‌తో టీడీపీని కార్నార్ చేయాలని వైసీపీ భావించింది .. అయితే జరిగే నష్టాన్ని ముందుగానే పసిగట్టినట్లు కూటమి ప్రభుత్వం కిరణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవడం అతి పెద్ద చర్చగా మారింది

జగన్ భార్య భారతిపై కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..వైసీపీ శ్రేణులు దానిపై తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ…టీడీపీ నాయకత్తానికి మహిళల పట్ల గౌరవం లేదనే విధంగా పోస్టులు, మీమ్స్ షేర్ చేశారు. కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి భార్యపై ఐ టీడీపీ కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీని ఇరుకుపెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నించింది

వైసీపీ ఫాలోయర్స్ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ షేర్స్ చేశారు.. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ టీడీపీ శ్రేణులు కౌంటర్లు మొదలుపెట్టాయి. టీడీపీ నుంచి వస్తున్న కౌంటర్‌తో వైసీపీలోను ఆంతర్మధనం స్టార్ట్ అయిందట. కిరణ్‌ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన వైసీపీకి టీడీపీ క్యాడర్ పాత విషయాలు గుర్తు చేస్తూ గట్టిగానే ఎదురు దాడి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత భార్యతో పాటు మహిళా నాయకుల పట్ల ఏ విధంగా మాట్లాడారో అందరికి తెలిసిన విషయమే. శాసనసభ్యులు సభలో చంద్రబాబు కుటుంబం గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు సభలో ఉన్న జగన్ ఖండించకపోగా ఆనందించారనే విషయాన్ని టీడీపీ ఫాలోయర్స్ వైరల్ చేయడం మొదలుపెట్టారు

అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా నిత్యం అసభ్యకరమైన పోస్టులతో రెచ్చిపోయిన విషయాన్ని ట్రోల్స్ చేశారు. వైసీపీ ముఖ్యనేతలు స్క్రిప్ట్‌లు ఇచ్చి పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డి వంటి వారితో సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేయించారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రరెడ్డి సైతం చంద్రబాబు కుటుంబంపై దారుణమైన పోస్టులు పెట్టారు.. వాటికి సంబంధించి టీడీపీ వర్గాలు వెల్లువలా పోస్టులు పెట్టడంతో వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడినట్లైంది..

తాజాగా కిరణ్ వ్యాఖ్యలతో గతంలో జరిగిన తప్పులను మర్చిపోయే విధంగా చేయాలనుకున్న వైసీపీకి టీడీపీ గట్టి షాక్‌ ఇచ్చిందంటున్నారు. వైసీపీ నుంచి యాక్షన్ రాక ముందే టీడీపీ పెద్దలు అలెర్ట్ అయ్యారు. భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వెటీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మింగుపడడంలేదట. పైపెచ్చు కిరణ్‌పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడంతో వైసీపీ నేతలకు సౌండ్ లేకుండా పోయిందంట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ శ్రేణులు సోషల్‌ మీడియాలో ఎంత విచ్చలవిడిగా చెలరేగిపోయాయో తెలిసిందే. అప్పుడు జగన్ తన వారిని కంట్రోల్ చేయడం కాదు కదా.. ఒక రకంగా ప్రోత్సహించారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ గొంతులో వెలక్కాయ పడినట్లైందట

వైసీపీ నేతలు సోషల్ మీడియాలో, ప్రెస్‌మీట్‌లలో మహిళలను దూషించినా…అసభ్యకరమైన పోస్టులు పెట్టినా పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా…సమర్ధించే విధంగా వ్యవహారించారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టేవారికి పేమెంట్లు కూడా ఇచ్చే వారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కిరణ్ విషయంలో టీడీపీ వ్యవహారించినట్లుగానే ..నేతలను కంట్రోల్ చేసి, అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టినప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ఉన్నట్లైతే ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమిత అయ్యే వాళ్లం కాదనే చర్చ వైసీపీలో నడుస్తోందట.

కిరణ్‌పై చర్యలు తీసుకోవడంపై ఇటు టీడీపీలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్‌పై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ అధిష్ఠానం గుంటూరు పోలీసులను ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను గౌరవప్రదమైన రీతిలో ఉపయోగించాలన్న సందేశాన్ని పార్టీ సమర్ధంగా ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం పార్టీ చర్యలను వ్యతిరేకిస్తున్నారట. గతంలో రెచ్చిపోయినవైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా….పార్టీ కార్యకర్తపై చర్యలు ఏంటని ప్రశ్నిస్తున్నారట . మొత్తానికి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారు ఎవరైనా, ఎంతటివారైనా ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పినట్లైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామంతో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుంటారంటున్నారు.