
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం… ఆర్థిక రాజధానిలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది… రాజకీయ సంక్షోభం ఇలా వచ్చిందో లేదో చోటా రాజకీయ నాయకులంతా విదేశాలకు చెక్కేస్తున్నారు… కాదు కాదు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లను ఆయా పార్టీలు ఫ్లైట్ ఎక్కించేస్తున్నాయి. పార్టీ నాయకులు దగ్గరుండి మరి విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తున్నారు… విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై ఈనెల 19న అవిశ్వాస తీర్మానం ఉంది. విశాఖ మేయర్‌ను పదవి నుండి దించేయడానికి కూటమిలోని పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి. కార్పొరేటర్లకు ప్రస్తుతం విశాఖ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోవడంతో వారు ఏం కోరితే అది జరిగిపోతుంది. నోరు తెరిచి అడిగితే చాలు క్షణాల్లో కార్పొరేటర్ల కోరికలను తీర్చేస్తున్నారు పొలిటీషియన్లు
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిత్రపక్షాలురాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలలో ఉన్న కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని మేయర్లపై, మున్సిపల్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం పెట్టి అధికారాన్ని చేజిక్కించుకునే పనిలో పడ్డాయి. ఏపీలోని చాలా మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలలో వైసీపీకి చెందిన కార్పొరేటర్ లను, కౌన్సిలర్లను టిడిపి, జనసేన తమ పార్టీలో జాయిన్ చేసుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాయి.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని వైసీపీ కార్పొరేటర్లను టిడిపి, జనసేన తమ పార్టీలో జాయిన్ చేసుకుని విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి … అనుకున్నదే తడవుగా క్షణం ఆలోచించకుండా వైసీపీ నుంచి టిడిపి, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్‌లను తమ పార్టీ కండువా కప్పి పార్టీల్లోకి ఆహ్వానించేశాయి. 58 మంది కార్పొరేటర్లు ఉన్న వైసీపీ నుండి 22 మంది కార్పొరేటర్లు టిడిపి, జనసేనల కండువా కప్పుకోవడంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య 36 కు పడిపోయింది. ఆ 36 మందిలో పార్టీ మారాలనుకునే కార్పొరేటర్‌లను కూడా తమ వైపు తిప్పుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టిడిపి ప్లాన్ చేసింది… టీడీపీకి జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ ల మద్దతుతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉండడంతో క్షణం ఆలోచించకుండా విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.
టిడిపి, జనసేన కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో వైసీపీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. కూటమి ఆలోచనలకు అందకుండా పక్కా ప్లానింగ్ చేసి తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు అందరితో వన్ టూ వన్ మాట్లాడి తెల్లవారేసరికి విమానం ఎక్కించి బెంగళూరు తరలించి క్యాంపు రాజకీయానికి తెర లేపారు. మార్చి నెల 24వ తేదీ నుండి ఇప్పటివరకు కూడా వైసీపీకి చెందిన 36 మంది కార్పొరేటర్లు బెంగళూరులో రిలాక్స్ అవుతున్నారు. బెంగళూరు నుండి వారిని శ్రీలంకలోని కొలంబో తీసుకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయంట.
ఒకపక్క వైసీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంపులు ఏర్పాటు చేసి 18 రోజులుగా బెంగళూరులోనే ఉంచారు. బెంగళూరు నుంచి కొలంబో టూర్‌కి తరలించేస్తున్నారు. టిడిపి మాత్రం తమకు చెందిన కార్పొరేటర్ల విషయంలో ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకోలేదు. టిడిపి నుంచి గెలిచిన కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుండి టిడిపిలో జాయిన్ అయిన కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా ఉండడంతో … వైసీపీ కార్పొరేటర్లు ఎంజాయ్ చేయడం చూస్తున్న టిడిపి కార్పొరేటర్లలో తిరుగుబాటు మొదలైనట్లు తెలిసింది. దాంతో టీడీపీ కూడా ఆఘమేగాల మీద భీమిలిలోపి ఓ రిసార్ట్స్‌లో తమ కార్పొరేటర్లకు క్యాంపు ఏర్పాట చేసింది
విశాఖ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలిలో క్యాంపు ఏర్పాటు చేయడంతో చిర్రెత్తిన కార్పొరేటర్లు పార్టీ నాయకుల ముందు తమ నిరసన వ్యక్తం చేశారంట. దీంతో ఈ నెల 18వ తేదీ వరకు టిడిపికి చెందిన 26 మంది కార్పొరేటర్లను తాజాగా మలేషియా ఫ్లైట్ ఎక్కించి విహారయాత్రలకు పంపేశారు. ఒకపక్క వైసీపీ నేతలు కూటమి పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కార్పొరేటర్లను విదేశాలకు తరలిస్తే, మరోపక్క టిడిపి తమ కార్పొరేటర్లను కాపాడుకుని అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది
ఇక ఇప్పుడు జీవీఎంసీ రాజకీయమంతా రానున్న పది రోజులు మలేషియా, కొలంబోలో కొనసాగనుంది. ఒకపక్క టిడిపి కూటమి అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్తున్నా… ఇంకా నలుగురు కార్పొరేటర్లు కూటమికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేస్తేనే టిడిపి అనుకుంది జరుగుతుంది. కానీ ఇప్పటికే 36 మంది కార్పొరేటర్లతో వైసిపి బెంగళూరు క్యాంపుకు వెళ్లడం అక్కడ నుండి కొలంబో ట్రిప్ ప్లాన్ చేయడంతో అవసరమైన మద్దతు కూడగట్టుకోవడం టీడీపీకి పెద్ద పరీక్షగా మారింది. ఈ నెల 19న విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో తమకు మెజారిటీ లేకపోయినా అవిశ్వాసాన్ని నెగ్గి తీరుతామని టిడిపి చెపుతుంది.
కానీ వైసీపీ మాత్రం అవిశ్వాస తీర్మానం సమయంలో ఓటింగ్ కి తాము రావలసిన పనిలేదని, కూటమి దగ్గర మెజారిటీ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్‌ను మార్చుకోమని సవాలు విసురుతుంది… విశాఖ మేయర్ పదవి కైవసం చేసుకోవడం కోసం టిడిపి, పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగినా … నిర్ణయాధికారం మాత్రం వైసీపీలో ఉన్న నలుగురు కార్పొరేటర్ల చేతిలో ఉండడంతో .. బెంగళూరులో ఉన్న వైసిపి కార్పొరేటర్ లను ఎలాగైనా విశాఖ రప్పించే ప్రయత్నం చేస్తుంది టిడిపి . దాన్ని గమనించిన వైసీపీ బెంగళూరు నుండి తమ కార్పొరేటర్‌లను కొలంబోకి తరలించనుండటంతో టిడిపి డైలమాలో పడినట్లు కనిపిస్తుంది.విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఎలా ఉన్నా ..ప్రస్తుతం వైసీపీ, టిడిపికి చెందిన దాదాపుగా 70 మంది కార్పొరేటర్లు మాత్రం హ్యాపీగా విదేశాల్లో సమ్మర్ టూర్ చేస్తూ ..ఆహ్లాదంగా గడిపేసే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నారంట. మరి చూడాలి అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎవరీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో.