
Actress Pakeezah Vasuki: వాసుకి.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ పాకీజా అంటే మాత్రం వెంటనే ఆమెను ఐడెంటిఫై చేసేస్తారు. . 90 లలో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనదైన వైవిధ్యమైన నటనతో ఇండస్ట్రీ లో ఓ వెలుగు వెలిగారు వాసుకి . ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సినిమాలకు ఆమె దూరమయ్యారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినా పాకీజా పేరుతోనే సినీప్రియులకు ఆమె బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఆమె .. తాజాగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించగా.. ఆమె తన కష్టాలను చెప్పి అందరి కంట కన్నీళ్లు తెప్పించారు. ఆమె దీన స్థితి గురించి తెలిసి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షణం ఆలోచించకుండా ఆమెకు ఆర్ధిక సాయం అందించారు.
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఉన్న వాసుకి ఎన్నో ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు పెద్దగా ఛాన్సులు కూడా రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. పూట గడవడమే కష్టంగా ఉందని..కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని.. తన గురించి వీడియో తీసి తమిళ ఇండస్ట్రీ లోని ప్రముఖులకు పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆమె మీడియాతో తెలిపారు. అందుకే ప్రభుత్వం సాయం కోసం ఏపీ కి వచ్చానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసి తన సమస్య చెప్పుకోవాలని అనుకున్నారు. ఈలోపే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాసుకి కి పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన సేనాని 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారు,ఎంమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ చెక్ ను పాకీజాకు అందజేశారు. పవన్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.
వాసుకి తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. తమిళనాడు సీఎం జయలలిత ఆహ్వానంతో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుకి. జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకానొక సమయంలో భిక్షాటన కూడా చేసే దానిని అని ఆమె చెప్పిన మాటలు అందరిని తీవ్రంగా కలిసి వస్తున్నాయి. పవన్ సాయంతో మరింత మంది స్పందించి ఆమెను ఆదుకుంటారని ఆశిద్దాం. Actress Pakeezah Vasuki.