కోవూరు తెలుగు తమ్ముళ్ల తీవ్ర అసంతృప్తి..!

ఎన్నికలకు ముందు ఒకలా..ఆ తర్వాత మరోలా..తనను గెలిపిస్తే అవినీతికి చోటు ఉండదని వగ్దానం చేసినా ఆ నియోజకవర్గమే ఇప్పుడు అవినీతికి అడ్డాగా మారుతోందా? మండలానికో వలసదారుడిని ఇన్చార్జ్ గా నియమించటమేనా..? స్పందించాల్సిన
నియోజకవర్గ ఎమ్మెల్యే కిమ్మనకుండా ఉండటంతో తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారా? గత టిడిపి అభ్యర్థి అయితేనే బాగుండేది అని భావిస్తున్నారా..? ఇంతకీ అది నియోజకవర్గం ? ఎవరా ఎమ్మెల్యే ? అసలేం జరుగుతుంది…లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి రెండో కోనసీమగా పేరుంది. అటు రైతులతో పాటు చైతన్యవంతులకు కొదవలేని ప్రాంతం ఇది. రాజకీయ ఉద్దండలు ఎక్కువగా ఉంటే ఈ ప్రాంతం నుంచి మొట్టమొదటిగా ప్రాతినిధ్యం వహించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు.అవినీతి రహిత, వివాదరహిత కోవూరు గా తీర్చిదిద్దటమే తమ ధ్యేయం అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కావటం సేవ భావం కలిగిన వ్యక్తులుగా పేరు ఉండడంతో ప్రజలు ఆదరించారు. కానీ ఎన్నికలకు ముందు ఒక లెక్క ..ఎన్నికలు అయిన తర్వాత వోలెక్క అన్నట్లుగా మారింది పరిస్థితి . నియోజకవర్గంలో అవినీతికి చోటు లేదని ముక్తకంఠంతో ఎమ్మెల్యే చెబుతున్నా మండలాలకు నియమించిన ఇన్చార్జులు చాప కింద నీరులా అవినీతిని నింపుతున్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్, కోళ్ల వ్యర్ధాల తరలింపుతో కమిషన్లు వసూలు చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.

ఇన్చార్జుల వ్యవహారశైలిపై నియోజకవర్గంలో కొంతమంది తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఉన్న నాయకులకు కాకుండా ఇన్చార్జిలకు పెత్తనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రకటించిన మండల అధ్యక్షుల పదవులలో సీనియర్లకు కాకుండా అనుభవం లేని కొంతమంది వలసదారులకు ఇవ్వడం పట్ల కూడా తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత మొదలైంది అన్న చర్చి నడుస్తుంది.మరోపక్క వైసీపీ పార్టీ నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలను చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కోవూరులో టీడీపీకి గట్టి దెబ్బ తగులుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అప్పట్లో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలంరెడ్డి రూపంలో పార్టీ బలోపేతం అయితే.. ఉన్నట్లుంది అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోయిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుతం పోలం రెడ్డి దినేష్ రెడ్డి నామినేటెడ్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నియోజకవర్గంలో ఆయన పేరు తరచుగా వినపడుతుంది . ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డి ఉండి ఉంటే అటు పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నాయకుల తో పాటు సీనియర్లకు పదవులతోపాటు ప్రాధాన్యత దక్కి ఉండేదేమో అన్న టాక్ నడుస్తోంది. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ ఇష్యూపై స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.