గోదారోళ్లే టార్గెట్‎గా కమలం పావులు కదుపుతోందా?

గోదావరి జిల్లాల ప్రజలు అన్నిటిలోనూ కూసంత వెరైటీ. దానిలో దీనిలో అని కాదు. అన్నిటిలోనూ అలాగే ..రాజకీయాల్లో కూడా గోదావరి జిల్లాల రాజకీయాలు చాలా విలక్షణంగా ఉంటాయి. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి మంచి పట్టు ఉంటుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఓ నానుడి ఉంది. ఆ కోవలోనే ఇప్పుడు గోదావరి జిల్లాలను కమలం టార్గెట్ చేసిందా? వరసుగా అన్ని సామాజిక వర్గాల వారికి పదవులు ఇస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందా? గోదావరి జిల్లాల్లో జెండా పాతాలనుకుంటుందా ? అసలు ఏంటా కథ ఏంటా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా గోదావరి జిల్లాలపైనే అందరి చూపు ఉంటుంది . ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అందరూ అంటుంటారు . అలాగే జరుగుతుంది కూడా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఉభయగోదావరి జిల్లాల్లో క్లీన్ స్విఫ్ట్ చేసింది అలాగే 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు 2024 కూటమి ఏర్పడినా గోదావరి జిల్లాల్ల ప్రభావం స్పష్టంగా ఉందంటారు నిపుణులు. ఇదే క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో బీజేపీ తన బలంపెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కమలం పార్టీ కార్యకర్తలు నాయకుల్లో కొత్త ఉత్సాహం మొదలైందట. గతంలో బీజేపీ నుంచి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారు. కాకినాడ నరసాపురం ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా ఎదిగారు. బీజేపీకి బలమైన పునాది వేశారు. ఇక నరసాపురం ఎంపీగా గతంలో గోకరాజు గంగరాజు బిజెపి నుంచి గెలుపొందారు. ఏపీలో బిజెపికి బలమైన కేడర్ ఎక్కడ అంటే నరసాపురం పార్లమెంట్ అందులోనూ భీమవరం నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంటుంది. ఇప్పుడు అదే మాదిరి బిజెపి నరసాపురం పార్లమెంటు నుంచి ఏపీలో పాగా వేసేందుకు వ్యూహరచనలు చేస్తుందట. ఎందుకంటే బిజెపిలో సీనియారిటీ చూస్తూ కీలక సామాజిక వర్గాల వారికి కీలక పదవులు ఇస్తూ పట్టు సాధించే విధంగా అడుగులు వేస్తుందట.

గోదావరి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైనా కాపు, కమ్మ ,క్షత్రియతో పాటు బీసీ వర్గాలు కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి . నరసాపురం పార్లమెంటులో గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆ తర్వాత గోకరాజు గంగరాజు బిజెపిలో గెలుపొందారు. ఈసారి అనూహ్యంగా నుంచి రఘురామకృష్ణం రాజు పోటీకి సిద్ధమైనా బీజేపీ ఆయనను పక్కనపెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన భీమవరం భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు నరసాపురం ఎంపీ సీటును కేటాయించింది . ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిని కూడా చేసి బిజెపిలో క్షేత్రస్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని చాటే విధంగా ప్రయత్నించింది. అదే విధంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నాయకులు ఎప్పుడూ బిజెపి గుర్తిస్తుందని క్షత్రియ సామాజిక వర్గం వారికి కేంద్రమంత్రిని ఇవ్వడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా అనుకూలంగా ఉంటారని భావించింది. అందుకు తగ్గట్లుగానే సామాన్య కార్యకర్త అయిన తనను కేంద్ర మంత్రిని చేసింది బిజెపి అధిష్టానం అని కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఉన్నారు శ్రీనివాస్ వర్మ.

అలాగే కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గం వారిని తమ వైపు తిప్పుకునే విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని మరోసారి సోము వీర్రాజుకు ఇచ్చి పట్టం కట్టింది బిజెపి. అయితే ఐదు దశాబ్దాలుగా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న బీసీ నేత పాక సత్యనారాయణకు పార్టీ పెద్దపేట వేస్తుందని అందరూ భావించారు. ఆయన కూడా నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని మరీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ని సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో బీసీ వర్గానికి అన్యాయం జరిగిందని ప్రచారం జరిగింది . సొమ్ము వీర్రాజు సీనియర్ కావడం అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ సోము వీర్రాజు శిష్యుడు కావడం అన్ని అంశాలు ఆయనకు కలిసి వచ్చాయని చర్చ నడిచింది . అయితే ఇక్కడ పాకా సత్యనారాయణ కూడా భూపతి రాజు శ్రీనివాస వర్మ కు చిరకాల మిత్రుడే అయినా… బీసీ నాయకుడికి అన్యాయం జరిగిందని కేడర్లో అందరూ అనుకున్నారు. అయితే నెలరోజులు తిరగకుండానే పాక సత్యనారాయణకు ఏకంగా రాజ్యసభ సీటు దక్కడంతో గోదావరి జిల్లాలోని బీసీ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి.

పాక సత్యనారాయణ లాంటి మిత్రులకు న్యాయం చేసేందుకు సోము వీర్రాజు ఇటు శ్రీనివాస వర్మ బిజెపి అధిష్టానం వద్ద పావులు కదిపినా… ఎంతోమంది కీలక నేతలు ఉన్నప్పటికీ.. ఏపీలోని రాజ్యసభ సీటు ఇటు నరసాపురం పార్లమెంటులోని భీమవరం నియోజకవర్గంలోని బీసీ నాయకుడికి రావడం అందులోనూ పాక సత్యనారాయణకు రావడంతో బిజెపి వ్యూహాత్మకంగా గోదావరి జిల్లాలపై కన్నేసిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటు గోదావరి జిల్లాలలో కమ్మ, కాపు, రెడ్డి, బీసీ నాయకులకు సీనియారిటీ ప్రకారం పదవులు కట్టబెట్టడం కైడా.. బిజెపి వ్యూహాత్మకంగా గోదావరి జిల్లాలపై పట్టు సాధించడం కోసమే అని అనుకుంటున్నారు . అన్ని సామాజిక వర్గాల వారికి చట్టసభల్లో తగిన న్యాయం చేసి భవిష్యత్తులో పొత్తు ధర్మము ఉన్నా లేకున్నా తనదైన శైలిలో బిజెపి ముద్ర ఉండాలని అనుకుంటుందట. అందుకనే తమ క్యాడర్ ఉన్నచోట తమ పార్టీ బలంగా ఉండాలని బిజెపి నిర్ణయించుకుందట. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, సీనియర్లకు పదవులు ఇస్తూ వస్తుందట.

కమలం పార్టీలో గోదావరి జిల్లాల్లో కష్టపడి పనిచేసే కిందిస్థాయి కార్యకర్తలకు కూడా పదవులు దక్కడంతో తరువాత ఎవరి నెంబర్ వస్తుందో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారట . అయితే ఇదే వరుసలో దెందులూరు టికెట్టు ఆశించి భంగపడ్డ తపన చౌదరి… గోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గంలో టికెట్ ఆశించిన శరణాల మాలతీరాణి , కోడూరి నారాయణ వంటి ఎందరో సీనియర్ నాయకులు వెయిటింగ్ లో ఉన్నారంట. వీరిలో తర్వాత వరుసలో ఉన్న అదృష్టవంతులు ఎవరు అని చర్చ నడుస్తుంది. కమలం పార్టీలో అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గోదావరి జిల్లాలో పాగా వేయాలని కమలం పార్టీ చూస్తుందట. అయితే రాబోయే రోజుల్లో పొత్తు ధర్మం ఉన్నా లేకున్నా బలమైన కేడర్ ను ఏర్పాటు చేసుకోవాలని కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు అక్కడి ప్రజలు.