
ఆ నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రి ఒకప్పుడు ఫైర్ బ్యాండ్ ..కానీ ఇప్పుడు ఫ్లవర్ బ్యాండ్ అయ్యారా..? గత ప్రభుత్వంలో మంత్రిగా హల్ చల్ చేసిన ఆమె ఇప్పుడు సెగ్మెంట్ లో పెళ్ళిళ్లు,శుభకార్యాల హాజరుకే పరిమితమవుతున్నారా? ఏపీఐఐసీ భూముల వ్యవహారం,అడుదాం ఆంధ్ర నిధుల గోల్ మాల్ విషయంలో ఆమెకు ఉచ్చు బిగుస్తోందా? సిట్ విచారణకు కూడా తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తుండటంతో నియోజకవర్గానికి ముఖం చేటేశారా? ఉట్టికి స్వర్గానికి మధ్యలో ఉన్న ఆ మాజీ మంత్రి నియోజకవర్గంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేకప్ తో బుల్లితెరపై కనిపిస్తున్న ఆమె గురించి వైసీపీ క్యాడర్ ఏమనుకుంటోంది.?లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
వైసీపీ ముఖ్య నేతలు, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత, నెక్ట్ ఏంటి అనే అలోచనలో పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ సీనియర్లు చాలా మందే ఉన్నారు. ఒకరిద్దరు మినహా చాలా మంది వారి రాజకీయ భవిష్యత్తు పై పునరాలోచనలో పడ్డారు. అయితే ఒక్క పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు మినహా, ఎవరూ గత ఎన్నికల్లో గెలవలేదు. ఆ క్రమంలో మిగిలిన సీనియర్లు తమ రాజకీయ మనుగడ కోసం నానాపాట్లు పడుతుంటే.. ఎక్కడికక్కడ సీన్ రివర్స్ అవుతూ తమ పన్నాగాలన్నీ బూమరాంగ్ అవుతుండటంతో వాట్ నెక్ట్స్ అని జుట్లు పీక్కుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఆర్.కె.రోజా గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో నియోజకవర్గానికి ముఖం చేటేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ముఖ్యల పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, చావులకు వచ్చి వెళ్తున్నారే తప్ప క్యాడర్ తో కలిసి నడవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు మంత్రిగా ఉన్నప్పుడు బుల్లితెరకి దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం మేకప్ వేసుకుని, కెమెరా ముందుకు వెళ్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఓ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఈవెంట్ కి మళ్ళీ ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ అలా ఉంచితే, వైసీపీ ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా, మంత్రిగా పనిచేసిన రోజా.. పదవిలో ఉన్నంత కాలం,ప్రతిరోజూ మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి, అప్పటి ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడేవారు. అధినేత జగన్ కు వీరవిధేయురాలిగా కొనసాగారు. జగన్ పై ఈగ వాలకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఊదరకొట్టారు. టీడీపీ, జనసేన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత దూషణలు, రాజకీయ వేదికలపై చేసిన వ్యాఖ్యలు విపక్షాలను తీవ్రంగా భాధించాయి. అయితే ఇప్పుడు అదే నేచర్ ఆమెకు గుణపాఠం నేర్పిస్తోందని ఆమె రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె పై అవినీతి, ఆరోపణలు బలమైనవిగా మారుతుండటంతో, నేర విచారణ తర్వాత ఆమె అరెస్టు కూడా తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మాజీ మంత్రి రోజా పై ఆడుదాం ఆంధ్ర, ఏపీఐఐసీ భూముల అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తాయి. అడుదాం అంధ్రతో పాటు ఏపీఐఐసీ భూముల అవకతవకలు ఆమె మెడకు చుట్టుకున్నాయి. వాటిపై విచారణలు ప్రారంభమవుతున్నాయని ప్రచారం జరగడంతో ఆమె గత కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. మొదట్లో హాడావుడి చేసిన అమె, ప్రస్తుతం కూటమిలోని కొంతమంది సహాకారంతో కేసు నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దానికి తోడు అమెను నగరి ఇన్చార్జి పదవి నుంచి తప్పించి మరొకరికి కట్టబెట్టడానికి పార్టీ అధిష్టానం సిద్దంగా ఉందంటున్నారు. అయితే తానే కాకుండా, ఆడదాం అంధ్రాలో చాలామంది ప్రమేయం ఉందని, భవిష్యత్తులో వారు కూడా చిక్కుల్లో పడుతారనే భయంతోనే సైలెంట్ అయ్యారని ఆమె సన్నిహితుల వద్ద చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
జిల్లాలో ఓ వైపు భూ ఆక్రమణలపై పెద్దిరెడ్డి, తుడా నిధులు దుర్వినియోగం పై చెవిరెడ్డి, టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భూమన, అడుదాం ఆంద్ర అక్రమాలపై రోజాను అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. అది చాలదన్నట్టు, మినీ మహానాడులో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నగరి సెగ్మెంట్‌లో రోజా చేసిన అవినీతి, అక్రమాలు, లంచాల వ్యవహారాల సంగతి తేలాలంటే, ప్రత్యేకంగా సిట్ ను వేసి, దర్యాప్తు జరపాలంటూ గాలిభాను, ఆమె పై పెద్ద బాంబు పేల్చారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా,ఇప్పుడు దీని చుట్టూనే ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయం తిరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో 120 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు గోల్‌మాల్ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఆట వస్తువులు, బ్రోచర్లు, జెర్సీలు ,టోపీల పేరుతో భారీగా దోచేశారన్న ఫిర్యాదులపై ఇటు విజిలెన్స్, అటు సిఐడి దర్యాప్తు చేస్తున్న వేళ ఉన్నట్టుండి నగరి ఎమ్మెల్యే సిట్ అనడం వెనకున్న ఆంతర్యం ఏంటన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే, ఈ మాటల వెనక పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఓవైపు ఆడుదాం ఆంధ్ర పై విచారణ జరుగుతున్న టైంలోనే, నాకేం కాదన్న ధీమాతో రోజా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని తనదాకా రాకుండా చూస్తారన్న ధీమాతోనే మాజీ మంత్రి తిరిగి నోటికి పని చెబుతున్నట్టు ఆ సెగ్మెంట్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఆమె మళ్లీ సీఎం, డిప్యూటీ సీఎం మీద నోరు పారేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది.
మరో వైపు అడపాదడపా ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఇక లాభం లేదనుకున్న నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ రూట్ మార్చారన్నది ఆయన సన్నిహితవర్గాల సమాచారం.రోజా దూకుడుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సిట్ దర్యాప్తు అంశాన్ని తెర మీదికి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నగరిలో టిటిడి ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం పాదిరేడు రైతుల దగ్గర తీసుకున్న భూముల్లో దాదాపు 50 కోట్ల వరకు గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి రోజా మనుషులు 10 శాతం కమీషన్ వసూలు చేశారని ,ఇందులో అప్పటి టిడిడి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నరోజాకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తన అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు, కోసల నగరం 40 ఎకరాల భూమి, తిరుమల దర్శనాలు, బెంజ్ కారు కహానీ, వైజాగ్ లో భూములు, ఏపిఐసిసి చైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అప్పుడు పొందిన లబ్ది, విల్లాలు అంటూ చాంతాడంత లిస్ట్ ఉందని గాలి భానుప్రకాష్ వర్గీయులు చెప్పుకుంటున్నారు. అందుకే వీటన్నింటి మీద సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇవన్నీ చాలవన్నట్టు, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని రోజా మోసం చేశారంటూ,ఆ వ్యవహారాన్ని కూడా బయట తీస్తున్నారట నగరి తెలుగు తమ్ముళ్ళు. ఇలా రోజా మీదున్న ఆరోపణలన్నిoటినీ మరోసారి ప్రస్తావించి, సిట్ దర్యాప్తునకు డిమాండ్ చేయడమేగాక, ఈ ఏడాది కాలంలో నేను ఎవరి దగ్గరన్నా, ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపించమంటూ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సవాల్ చేయడం మరింత కాక రేపుతోంది. ఆవిధంగా, నగరి ఎమ్మెల్యే ఓ వ్యూహంతో రోజా శిబిరంలో కలవరం మొదలైందన్న చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతోంది. ఆయన భయపెట్టడానికి సిట్ దర్యాప్తు డిమాండ్ చేశారా? నిజంగానే, ప్రభుత్వంలో ఆ దిశగా కదలికలు ఉండి, ఎమ్మెల్యే వాటి గురించి ప్రస్తావించారా అంటూ ఆరా తీస్తున్నారట మాజీ మంత్రి అనుచరగణం. మొత్తం మీద నగరిలో కొత్తగా, సిట్ రాజకీయ సెగలు పుడుతున్నాయి.జిల్లాలో మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా,ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయం మొత్తం రోజా చుట్టూనే తిరుగుతోంది.రోజా అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిగి, అవినీతి ఆరోపణలు నిరూపితమైతే, ఆమె జైలుకి వెళ్లడం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.