కేసుల టెన్షన్?

మాజీ మంత్రి విడదల రజనీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు.. జగన్ కేబినెట్‌లో మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పరుష పదజాలం వాడని ఆమె ఇటీవల సవాళ్లు విసురుతూ.. పోలీసులను కూడా టార్గెట్ చేస్తుండటం అభద్రతాభావంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది.. అయితే అది సాధ్యపడక పోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెర లేపుతున్నారంటున్నారు.. అసలు ఆమెలోని కొత్త కోణంపై జరుగుతున్న చర్చేంటి

చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజనీ పొలిటికల్‌గా లక్కీస్టార్ అనిపించుకున్నారు ,ఎంత తక్కువ కాలంలో ఎదిగారో అంతే తక్కువ కాలంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో తిరిగి చిలకలూరిపేటలో గెలిచే పరిస్థితి లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆమెని గుంటూరు వెస్ట్‌కి షిఫ్ట్ చేశారు. పోనీ అక్కడైనా గెలిచారా అంటే అదీ లేదు. ఆ తర్వాత జగన్ తిరిగి తనదైన లెక్కలతో రజనీని చిలకలూరిపేట ఇన్చార్జ్‌గా పంపించారు.

తనను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించిన చిలకలూరిపేటకు తిరిగివచ్చిన విడదల రజనీకి అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతోందంట… కారణం ఆమెపై, ఆమె అనుచరవర్గంపై వరసగా నమోదవుతున్న కేసులే అంటున్నారు. జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ వ్యవహారమే తీసుకుంటే.. రైతుల నుంచి కమీషన్ల పేరిట రజనీ టీమ్ డబ్బు వసూలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి సర్కారు ఏర్పడినాక దానిపై కొందరు కంప్లయింట్ చేయడంతో.. ఆమె తీసుకున్న డబ్బులు తిరిగిచ్చి సెటిల్‌మెంట్ చేసుకున్నారంట. కేసులు పెట్టిన వారు వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ.. కొందరు మాత్రం పట్టు వదలడం లేదట. తమతో పాటు మరికొందరు బాధితులను కూడా పోగేస్తూ.. రజనీపైకి ఉసిగొల్పుతున్నారట.

అదలా ఉంటే ఎన్నికల టైంలో రజనీ తన దగ్గర ఐదు కోట్ల రూపాయల డబ్బు తీసుకుని మోసం చేశారని.. గతంలో వైసీపీలో పని చేసి ప్రస్తుతం టీడీపీలో ఉన్న మల్లెల రాజేష్‌నాయుడు ఆరోపించారు. అప్పట్లో ఈ అంశం కలకలం రేపింది. అప్పట్లో రాజేష్‌నాయుడు చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఎన్నికల టైమ్‌లో రాజేష్ చేసిన ఆరోపణలతో రజని కొంత మొత్తం తిరిగిచ్చారని.. అయితే పూర్తిగా సెటిల్‌మెంట్ చేయలేదన్న ప్రచారం జరిగింది.

ఆ క్రమంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో రజినిపై… ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -టీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019 లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు, రజిని పీఏలు నాగఫణీంద్ర, రామకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుతో పాటు రజనీపై బాలాజీ స్టోన్ క్రషర్ కేసున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో నాడు విజలెన్స్ ఎస్పీగా చేసిన జాషువా, రజనీ బావమరిది గోపీనాథ్, పీఏ రామకృష్ణపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇక ఇటీవల విడదల రజని మరిది గోపినాథ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఏసీబీ పోలీసులు గోపీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విడదల రజని ఏ1గా, ఆమె మరిది విడదల గోపీనాథ్ ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు.

ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ విడదల రజని, గోపీనాథ్‌లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిలు పిటిషన్లపై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. వారికి అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. అదలా ఉండగానే తాజాగా విడదల రజనీ మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు.

ఇలా ఒకదాని వెంట మరొకటిగా.. కేసులు వెంటాడటంతో రజనీ తీవ్ర ప్రస్ట్రేషన్‌కు గురవుతున్నారంట. తనపైనే కాక, తన అనుచరులపైనా కేసులు బుక్ అవుతుంటే.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమె.. పైకి ధైర్యంగా ఎదుర్కుంటానని మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఆమె గజగజ ఒణికిపోతున్నారని అనుచరులే అంటున్నారు. రజనీ వర్గం అంతా ఆ టెన్షన్‌లో ఉన్న తరుణంలోనే ఆమె ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు కుటుంబాల వారిని పరామర్శించేందుకు రజిని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి కారులో వెళ్లారు. ఆ కారులో శ్రీకాంత్‌ రెడ్డి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి సుబ్బనాయుడు పోలీసు సిబ్బందితో కలిసి జంగాలపల్లెలో రజిని కారును చుట్టుముట్టారు. లోపల దాక్కుని కూర్చున్న శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీఐ కారు తలుపులు తీయబోగా రజిని అడ్డుకున్నారు. ‘ఏంటిది సీఐ గారు’ అని ఆగ్రహంతో ఊగిపోతూ పెద్దగా కేకలు వేశారు. కారుకు అడ్డంగా నిలబడి తలుపులు తీయనీయలేదు. రజిని పోలీసులతో చాలాసేపు వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. రజిని కేకలు వేస్తూ అడ్డుకుంటూ ఉండగానే పోలీసులు బలవంతంగా కారు తలుపులు తెరిచి శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తామని చిలకలూరిపేటకు చెందిన ఎం.రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ.24లక్షలు వసూలు చేసిన చీటింగ్‌ కేసు విషయంలో విడదల రజని అనుచరుడ్ని అదుపులోకి తీసుకున్నారంట. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. శ్రీకాంత్‌రెడ్డిపై మరికొన్ని కేసులూ ఉన్నాయంటున్నారు.

శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్న సమయంలో విధినిర్వహణలో ఉన్న పోలీసులతో రజని దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ.. తన అనుచరుడు అరెస్ట్‌కు కారణం చెప్పాలని సీఐ సుబ్బారాయుడును నెట్టేశారు. విడదల రజని ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై దాడికి ప్రయత్నించి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించారు.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడన్న కేసులో చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్‌చల్‌ సృష్టించారు. దీంతో గోరంట్ల పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే తరహాలో మంత్రిగా పనిచేసిన విడదల రజనీ కూడా పోలీసులతో గొడవ దిగడం వివాదాస్పదమవుతోంది. అయితే రజని మాత్రం పేర్ని నాని, తదితర వైసీపీ నేతలను వెంటేసుకుని మీడియా ముందు కొచ్చేసి పోలీసులది దౌర్జన్యమంటూ తెగ వాపోతున్నారు.

రజని కారులోనే మానుకొండ శ్రీకాంత్‌రెడ్డి తిరుగుతున్నాడన్న పక్కా సమాచారంతోనే పోలీసులు అటకాయించి అతన్ని అదుపులోకి తీసుకున్నారంట. ఆయను అరెస్ట్ చేయొద్దని పోలీసులని రజని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులతో విడదల రజని పోలీసులతో వాగ్వాదానికి దిగి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా ముందు మాత్రం ఆమె బేలగా మాట్లాడుతున్నారు. తనను ప్రజల్లో తిరిగనీయకుండా చేయడానికే కుట్రలు చేస్తున్నారని వాపోతున్నారు.

మొత్తానికి రజనిపై అనేక కేసులు నమోదవుతుండటంతో… ఎటు నుంచి ఎటు చూసినా ఉచ్చు బిగుస్తోందంటున్నారు. ఇదంతా రజని స్వయం కృతాపరాధమేనంటున్నారు వైసీపీలోని ఒక వర్గం నేతలు. అధికార దుర్వినియోగం.. పార్టీ కార్యకర్తలను సైతం లెక్క చేయకుండా ఏకఛత్రాపత్యంలా వ్యవహరించడంతో ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. మరి చూడాలి రజని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?