
ఆ నియోజకవర్గం రెండున్నర దశాబ్దాల నుంచి టిడిపి కి కంచుకోట. అభ్యర్థి ఎవరైనా సరే స్థానికులా, స్థానికేతరులా అనేది అక్కడ ప్రజలు ఆలోచించరు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరిని నిలపెట్టినా అక్కడ ఎగిరేది మాత్రం పచ్చ జెండానే. మొన్న జరిగిన 2024 ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అధికారంలో ఉన్న మహిళా మంత్రి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మహిళ మధ్య పోటీలో అప్పటి మంత్రిని అవలీలగా ఓడించి, రాష్ట్ర రాజకీయాలు తన గురించి ఆలోచించేలా చేసింది ఆ మహిళ. గెలిచిన నాటి నుంచీ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు ఆ నేత.
గుంటూరుజిల్లా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కుట్రలు, కుతంత్రాలతో కూడిన రాజకీయం. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గo నుంచి గల్లా మాధవి, వైసీపీ అప్పటి మంత్రి విడుదల రజినీ బరిలో దిగారు. ఈ పోరులో మాధవి సునాయాసంగా గెలిచారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అధినేత చంద్రబాబుకు గిఫ్టుగా అందజేశారు. ఎన్నికల్లో గెలిచిందే మొదలు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపైనే ఆమె సీరియస్ వర్క్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఈ పరిస్తితి నెలకొందో తెల్సుకుని, అక్కడ పర్యటించి అతి తక్కువ కాలంలోనే పరిష్కరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు.
2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ సీటు నుంచి గెలిచిన మద్దాల గిరి, టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టారు. అప్పట్లో జగన్ ప్రభుత్వమే ఉన్నా వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమాత్రం జరగలేదన్న ఆరోపణలు వచ్చాయి. కానీ గల్లా మాధవి గెలిచిన ఏడాది కాలంలోనే పశ్చిమ సీటులోని ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు ప్రారంభించడమే కాదు పూర్తి అయ్యేలా అధికారుల మీద ఒత్తిడి పెంచారు. అంతేకాదు, వైసీపీ కార్పొరేటర్లు గెలిచిన వార్డుల్లో కూడా తన మార్క్ రాజకీయం చూపిస్తూ ముందుకెళ్తున్నారు.
మరో విషయం ఏంటంటే, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి మారే విధంగా రాజకీయం నడిపారు. ఇక సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారి జాబితా తీసుకున్న ఆమె, పార్టీలతో ప్రమేయం లేకుండా ఫండ్ రిలీజ్ చేయించారు. స్వయంగా సీఎంతో మాట్లాడి 67 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు గల్లా మాధవి. స్వయంగా వారికి చెక్కులు అందజేశారు. గల్లా మాధవి తీరు చూసి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలే ఆశ్చర్యపోతున్నారట.