గురజాల కేంద్రంగా బస్తీ మే సవాల్..!

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ప్రజలు కూటమికి అనూహ్య మెజార్టీతో పట్టం కట్టారు. ఈ సంవత్సర కాలంలో కూటమి పాలనకు ప్రజలు ఇస్తున్న మార్కులు ఎన్ని..? హామీల అమలు.. అభివృద్ధి లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే అంశం పైన విపక్ష నేతల రెస్పాన్స్ ఏంటి? ఇదే అంశంపై ఇప్పుడు పల్నాడు రాజకీయాల్లో వేడి పెంచుతోందా? సవాళ్లు..ప్రతిసవాళ్లతో అక్కడి రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయా? గురజాల కేంద్రంగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలేంటి? బస్తీ మే సవాల్ అంటున్న నేతలు ఎవరు?
లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

సరిగ్గా ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 స్థానాలను కూటమి పార్టీ దక్కించుకుంది.ఇక, కూటమి పాలన ఏర్పడి ఏడాది పూర్తయిన వేళ పల్నాడు లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గురజాల నియోజకవర్గం అభివృద్ధి పై అధికార – విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తమ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా…. ఏడాది కాలంలో గురజాల లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశం పైన బహిరంగ చర్చ కు సిద్దమని రెండు పార్టీల నేతలు బస్తీమే సవాల్ అంటున్నారు.

గురుజాల నియోజకవర్గంలో ఎవరు ఏం చేసారో చెబుతూ.. క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో వేయి కోట్లు అభివృద్ధి నిధులు తెచ్చానని ఎమ్మెల్యే యరపతినేని చెప్పుకొచ్చారు… నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్ల పట్టణానికి ట్యాప్ ల ద్వారా కృష్ణ జలాలు తేవంటంతో పాటుగా…హైవే కు ల్యాండ్ సేకరణ టిడిపి హాయంలోనే జరిగిందని చెబుతున్న యరపతినేని…మెడికల్ కాలేజీనీ కూడా తానే తెచ్చానని వివరిస్తున్నారు.

అయితే, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఏడాది కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి ఏ మాత్రం జరగ లేదని పెదవి విరుస్తున్నారు. ఏడాది పాలన పూర్తిగా పడకేసిందని ఎమ్మెల్యేను టార్గెట్ చేసారు… అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. ఏడాది పాలన అభివృద్ధి పై చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మహేష్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే సహించమని హెచ్చరించారు. అవసరమైతే కోర్టు కు వెళ్తామని చెప్పుకొచ్చారు.

గురజాల నియోజకవర్గం అభివృద్ధి చేశానని.. గణాంకాలతో సహా చర్చ కు తాను సిద్దమని ఎమ్మెల్యే యరపతినేని ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఈ చర్చ రాజకీయంగా రెండు పార్టీల్లోనూ వేడి పెంచుతోంది. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించేందుకు సిద్దమని యరపతినేని ప్రకటించారు. ఇక, ఇప్పుడు వీరిద్దరి మాటల యుద్దం ఏ మలుపు తీసుకుంటుందనే ఉత్కంఠ నియోజకవర్గంలో రెండు పార్టీల్లోని కేడర్ లో కనిపిస్తోంది.