అన్నదాత సుఖీభవకు ఎలా అప్లై చేసుకోవాలి..?

Annadata Sukhibava Scheme: వ్యవసాయంలో రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కూటమి సర్కార్ తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ. ఎన్నికల ముందు ఇచ్చిన ఈ హామీని ఇప్పుడు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14 వేలు కాగా కేంద్రం 6 వేల రూపాయలను ఇవ్వనుంది. మొదటి విడతలో భాగంగా పీఎం కిసాన్‌ కింద 2 వేలు, అన్నదాత సుఖీభవ కింద 5 వేల కలిపి మొత్తం 7 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల 77 వేల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది. అయితే ప్రస్తుతం లిస్టుల్లో లేని రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ దరఖాస్తు చేయాలి?ఎవరిని సంప్రదించాలి? రైతుకు ఉండాల్సిన అర్హతలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా సేద్యాన్నివీడడు సాగుదారు. దేశానికి అన్నం పెట్టేందుకు తన స్వేదాన్ని ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగుదారుల సమస్యలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు లబ్ధి జరుగనుంది. పంటల సేద్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించే పథకం ఇది. ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రైతులకు 20 వేలు అందించనుంది. ఏడాదిలో మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. Annadata Sukhibava Scheme.

ఈ పథకానికి అర్హులు ఎవరంటే..ఆంధ్రప్రదేశ్ కి చెందిన రైతులు మాత్రమే అర్హులు. 5 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రైతుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించిన పత్రాలు, పట్టా లేదా పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలి. భూమి వివరాలు రైతు పేరు మీద ఉన్న ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.అదే విధంగా రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే, తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే.

ఆదాయపన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు..రిటైర్డ్ ఉద్యోగులు , ప్రజా ప్రతినిధులకు ఈ పథకం వర్తించదు.10 వేలు, అంతకంటే ఎక్కువ పింఛను పొందేవారు కూడా అనర్హులే. అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేయబోతున్నారు. కాబట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురి పేరు మీద భూమి ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్ తో పాటు ఇతర పత్రాలతో రైతు సేవా కేంద్రంలోని అధికారులను సంప్రదించాలి. అక్కడి సిబ్బందికి తమ వివరాలను అందించాలి.అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి, వివరాలను ధృవీకరించుకొని పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు. రైతుసేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్‌ల్యాండ్‌ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి, అర్హులైన వారిని ఈ ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు.ఇక అన్నదాత సుఖీభవ పథకంలో తమ పేరు ఉందా లేదా అని స్టేటస్ చెక్ చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైట్ లో ( https://annadathasukhibhava.ap.gov.in )ను ఓపెన్ చేయాలి. హోం పేజ్ లో ఉన్న నె యువర్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ కనిపిస్తుంది. వెబ్ సైట్ ను చూడటం రాని వాళ్లు రైతు సేవా కేంద్రం సిబ్బందని లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/actress-pakeezah-vasuki-get-2-lakhs-financial-assistance-from-pawan-kalyan/