అసంతృప్తిలో జ‌న‌సేన క్యాడ‌ర్..

కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌న‌సేన నాయ‌కుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని బ‌డా నేత‌లు, జ‌న‌సైనికులు భావిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల్లో త‌క్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తీసుకొని రాజకీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించిన జ‌న‌సేనానికి ఇప్పుడు స్థానిక‌ ప‌ద‌వుల నుంచి తీవ్ర ఎదురుదెబ్బ త‌గులుందని అంద‌రూ భావిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చేప‌ట్టిన ప‌ద‌వుల్లో అగ్ర‌భాగం టీడీపీ కైవ‌సం చేసుకోగ‌, కంటి తుడుపుగా జ‌న‌సేన‌కు కొన్ని ప‌ద‌వులు కేటాయించార‌ని అసంతృప్తితో ఉన్నారట. గుంటూరు మిర్చియార్డ్ చైర్మ‌న్ ప‌ద‌వి జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని కేడ‌ర్ కోరుకుంటుంది…అయితే టీడీపీ నుంచి తీవ్ర పోటీ ఉండ‌టంతో ఈ ప‌ద‌వి కూడా వ‌స్తుందా…? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జనసేన పార్టీకి ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు ఉన్నప్పటికీ ఎలాంటి గ్రామ,మండల,నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయకుండా ఇప్పటికి కూడా ఇంకా పార్టీ కోసం పని చేయాలంటూ చెప్ప‌డం దేనికి సంకేతమ‌ని జ‌న‌సైనికులు బాధ‌ప‌డుతున్నారు. ఎంతోమంది పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నప్పటికీ బయటకు మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రొఫైల్ పెట్టుకుని మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారా అనే విధంగా పనిచేస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు కంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం లేదంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ తమ సొంత నగదుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి నియోజక స్థాయిలో ఎలాంటి పదవులు అనుభవించకుండా మౌనం వహిస్తూ ఏం చేయాలో అర్థం కాక సొంత పనులు కూడా చేసుకోలేక స్థానిక ఎమ్మెల్యే ని అడగలేక చాలామంది మ‌నోవేద‌న ప‌డుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్యక్రమాలకు కూడా తమను పిలవడం లేదని నియోజకవర్గం, మండల స్థాయిలో ఐనా అసలు పదవులను దక్కుతాయా లేదా అంటూ పక్కవాళ్లకు చెప్పుకొని బాధపడుతున్నారట.

కొన్ని నియోజకవర్గాలలో ఏకంగా జనసేన పార్టీ నాయకులను దగ్గరకు కూడా రానివ్వడం లేదంటూ జ‌న‌సైనికులు ఆవేద‌న చెందుతున్నారు. ఈ విష‌యంపై అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మంత్రి పదవికి అంకితమయ్యారంటూ కేడర్ కు పదవులు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన ధోరణి మార్చుకోవాలని గ్రామస్థాయి నుండి సమావేశాలు నిర్వహించి 175 నియోజకవర్గాల్లో తన అభ్య‌ర్ధుల‌ను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

వచ్చే నెల‌ జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఖ‌చ్చితంగా సంవత్సరం పూర్తవుతుంది. ఏపీలో బీజేపీ పార్టీ మూడో స్థానానికి ఎగబాగుతుందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్రతి గ్రామం నుండి కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం గ్రామం నుండి కార్యకర్తలకు సంబంధించి పదవులు ఇవ్వడం ప్రతి నెలలో సమావేశాలు నిర్వహించడం ,…బీజేపీ పార్టీ గురించి ప్రభుత్వం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది పరిపాటిగా మారింది. ముఖ్యంగా బిజెపి పార్టీలోకి కార్యకర్తలు నాయకులు చేరడానికి ఇది ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో మండలాలకే పరిమితమైన బిజెపి పార్టీ ఈరోజు ఏకంగా గ్రామాలలోకి చొచ్చుకొని పోతుంది. జనసేన అండ్ టీడీపి పొత్తు కుదిరే సమయంలో జ‌న‌సేన‌కు 25 సీట్లు మాత్రమే తీసుకుంటున్నాం.. కాని నామినేటెడ్ పదవులల్లో మాత్రం జనసేన కి సింహ భాగం ఇవ్వాలని ఆనాడు ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీనికి చంద్ర‌బాబు కుడా ఒప్పుకున్నారు కాని గెలిచాక మొత్తం సీన్ మారిపోయింది.. టీడీపి అసలు కూటమి లోనే లేనట్లు.. అన్ని వాళ్ళే తీసేసుకుని జనసేన కి ప్రతిదానిలోని మొండి చేయి చూపిస్తున్నారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.. ప‌వ‌న్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం చూస్తుంటే.. టీడీపీ తన స్వార్ధ ప్రయోజనాలే చూసుకుంటున్నది పొత్తు ధర్మం ఎక్కడా వంద శాతం పాటించడం లేదని జ‌న‌సేన నేత‌ల పెద‌వివిరుస్తున్నారు .

పొత్తులో భాగంగా రెండున్న‌ర ఏళ్ళు ప‌వ‌న్ సీఎం పదవి అదిరోహించాల‌ని , కేడ‌ర్ కు పదవులు ఇవ్వాల‌ని …ప్రజల సమస్యలు తీర్చాలని తమకు మాత్రం ఉండదా అంటూ జనసేన పార్టీ నాయకులు లోలోపల మదనపడుతున్నారు. ఒకపక్క బీజేపీ పార్టీ చాప కింద నీరు లాగా ప్రవహిస్తూ పోతూ ఉంటే జనసేన పార్టీ మాత్రం నీరుగారిపోతుంది అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ గ్రామస్థాయిలో వెళితేనే ఎప్పటికైనా విజయం సాధిస్తామని అంటున్నారు జనసైనికులు. ఇప్పటికైనా అధిష్టానం గ్రామస్థాయి నుండి పార్టీని బలోపతం చేయాలని రాబోయే రోజుల్లో సీఎం పదవికి పోటీ చేసే విధంగా పనిచేయాలని… జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.