కేశినేని కేరాఫ్ ఎటు?

మాజీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నట్లా? లేనట్లా? అన్న చర్చ ఇప్పుడు విజయవాడలో నడుస్తోంది. రాజకీయలకు దూరంగా ఉంటాను అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాని. ఏ పార్టీలో లేకపోయినా ఆయన సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేస్తూనే ఉన్నారు. విజయవాడ ఎంపీ అయిన తన తమ్ముడు కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, బహిరంగ లేఖలతో ఆరోపణలు గుప్పిస్తున్నారు. నాని వైఖరి వెనుక రాజకీయం వ్యూహం ఉందా? కూటమి సర్కారుని ఇరుకున పెడుతూ వైసీపీకి అనుకూల వాతావరణం సృష్టించాలని చూస్తున్నారా?

విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన కేశినేని నాని.. గత ఎన్నికల ముందు టీడీపీ టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో చేరిపోయారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. దాంతో వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన తనను ఓడించిన విజయవాడ ఎంపీ, తమ్ముడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టారు.

టీడీపీ అయిన ఎంపీ అయిన చిన్నిని టార్గెట్ చేస్తూ.. ఆయన ప్రభుత్వాన్ని ఇరుకపెట్టే విధంగా వరస ట్వీట్లు చేయడం వెనక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. మాజీ ఎంపీ మళ్లీ రాజకీయంగా యాక్టివ్‌ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీగా ఓడిన తర్వాత నాని రాజకీయాలకు దూరమని ప్రకటించి, వైసీపీ కార్యాక్రమాల్లో పాల్గొనడం మానేశారు. అయినప్పటికీ ఆయన సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఆరోపణలు, బహిరంగ లేఖల ద్వారా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తొలుత విశాఖపట్నంలో 60 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడంపై కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సంస్థ వెనుక కేశినేని చిన్ని బినామీలు ఉన్నారని పోస్టులు పెట్టారు. చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాసి ఈ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే లిక్కర్‌ స్కామ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ కేశినేని చిన్ని పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌ కేసిరెడ్డి కంపెనీల్లో చిన్నికి వాటా ఉందని, చిన్ని కంపెనీల్లో కేసిరెడ్డి పార్టనర్‌గా ఉన్నారని..ఇద్దరూ కలిసి నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు గుప్పించారు.

ఈ కేసులో చిన్నిని కూడా విచారించాలని ఆయన డిమాండ్లు మొదలుపెట్టారు. ఎంపీ చిన్నికి లిక్కర్‌ స్కామ్‌లో పాత్ర ఉందనే విధంగా నాని చేస్తున్న ఆరోపణల వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకూ వైసీపీ నేతలు, అధికారుల పాత్రపై సిట్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వంలోని సిట్టింగ్‌ ఎంపీపై విమర్శలు చేయడం ద్వారా కేసు విచారణను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ మొదలైంది. మాజీ ఎంపీ కేశినేని నాని తన ఆరోపణలతో కేవలం చిన్నిని డ్యామేజ్ చేయడమే కాకుండా, కూటమి ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అది వైసీపీకి రాజకీయంగా ఎంత ఉపయోగపడుతుందో కాని నాని మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావడానికి పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

నాని చేస్తున్న ఆరోపణలు, పోస్టులు వైసీపీ అనుకూలంగా ఉండటంపైఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్త పరుస్తున్నారు. నాని చేస్తున్న పోస్టులు, లేఖలు, ఆరోపణలను వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో టాగ్ చేసి ప్రచారం చేస్తుండటం దానికి బలం చేకూరుస్తోంది. మాజీ ఎంపీ చేస్తున్న ఆరోపణలను ప్రస్తుత ఎంపీ చిన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు చిన్ని. నాని వెనక వైసీపీ బిగ్‌ బాస్‌ ఉన్నారని చెబుతూనే…హైదరాబాద్‌ కేంద్రంగా నాని కుట్రలు చేస్తున్నారని కొత్త బాంబ్‌ పేల్చారు .

హైదరాబాద్‌ కేంద్రంగా నాని ఏం చేస్తున్నానదేని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్ధితి. పదిరోజుల కిందట హైదరాబాద్‌లో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలతో కేశినేని నాని సమావేశమయ్యారని చిన్ని ఆరోపించారు. ఈ సమావేశం తర్వాతే నాని కొత్త రాగం ఎత్తుకున్నారని ఎంపీ వర్గీయులు అంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో పాల్గొనడం, తీవ్ర ఆరోపణలు చేస్తుండం వెనుక తాడేపల్లి నుంచి వచ్చిన డైరెక్షన్‌ ఉందంటున్నారు. అందుకు గత ఉదాహరణలను చూపుతున్నారు ఎంపీ వర్గీయుల.. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా నిత్యం జగన్‌కు మెసేజ్‌లు పంపిస్తూ నాని కోవర్టుగా పనిచేశారని అంటున్నారట. మొత్తానికి అన్నదమ్ముల మధ్య వార్ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.