కోనేటి ఆదిమూలం రాజకీయ భవిష్యత్తు..?

వ్యక్తిత్వపరంగా ఎలాంటి లౌక్యం తెలియని రాజకీయ నాయకుడు ఆయన. దాపరికం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉన్నవాడు. అంతేకాదు ఆవేశపరుడన్న ముద్ర కూడా ఆయనకుంది. వీటన్నిటికీ మించి ఎవరినీ లెక్కచేయరన్న పేరు కూడా ఉంది. ఇంతకీ ఎవరానేత, ఏ జిల్లాకు చెందిన వ్యక్తి… ఇది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం రాజకీయ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలోనే పడింది. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై గత ఏడాది సెప్టెంబరులో టిడీపీ సస్సెన్షన్ వేటువేసింది. ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సత్యవేడు పర్యటనతో తాడోపేడో తేలిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లోకేష్ పర్యటనలో జరగలేదు.దీంతో నియోజకవర్గంలోని టిడీపీ శ్రేణులు మాత్రం ఏటు తేల్చుకోలేని స్థితిలోనే ఉన్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా రెండవ సారి గెలిచిన ఆనందం ఆదిమూలానికి ఎక్కువ రోజులు మిగలలేదు. గతేడాది సెప్టెంబరులో ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీకే చెందిన ఓ మహిళా నాయకురాలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఘటన సంచలనం సృష్టించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.

ఇక తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు ఆదిమూలం. తన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని ఆ మహిళ హైకోర్టును కోరడంతో ఆ వివాదం అంతటితో ముగిసింది. ఈలోపు పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక కేసు సమసిపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తారని పార్టీ శ్రేణులు భావించినా, 8 నెలలుగా అధిష్ఠానం దానిపై దృష్టి సారించలేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనుల కోసం ఎన్నికల నాటి పరిశీలకుడు చంద్రశేఖర్ నాయుడు, తర్వాత నియమితులైన శ్రీపతి బాబులను కలవాలో, సస్పెన్షన్లో ఉన్న ఎమ్మెల్యేను కలవాలో అర్ధంకాని పరిస్థితిలో కేడర్ ఉంది.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే హేమలత కూడా నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత కొద్దిరోజులు ముందు శ్రీసిటీలో పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విచ్చేసారు. ఆయన పర్యటన సమయంలో నియోజకవర్గానికి పూర్తిస్థాయి కో-ఆర్డినేటర్ గానీ, లేదా ఇంఛార్జిని గానీ ప్రకటించడమో చేస్తారని అందరూ భావించారు. నాయకుడెవరో స్పష్టతనిస్తే తమ సమస్యలు చెప్పుకోవడానికి, పనులు చేసుకోవడానికి వీలు కలుగుతుందని కార్యకర్తలు అనుకున్నారు. అయితే యువనేత ఈ అంశంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సమస్యలుంటే ఇద్దరు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్ళాలని, లేదంటే జిల్లా ఇంఛార్జి మంత్రికి,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాలని సూచించి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఇప్పట్లో ఎత్తివేసే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ కేడర్ దాదాపుగా డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇంఛార్జిగా కూడా ఎవ్వరినీ నియమించే సూచనలు కనిపించడం లేదని డిసైడ్ అయ్యారు.

ఇక పార్టీ నియమించిన పరిశీలకులకు నియోజకవర్గంపై చెప్పుకోదగిన పట్టు లేదు.అధికారులు, ఉద్యోగులపై పట్టు అంతకన్నా లేదు. ఇంఛార్జి మంత్రి అందుబాటులో వుండరు. ఎప్పుడు వస్తారో,ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, పనులకు ఎవరిని ఆశ్రయించాలో , నామినేటెడ్ పదవులకు ఎవరు సిఫారసు చేస్తారో తెలియక పార్టీ శ్రేణులు, ఆశావహులు గందరగోళంలో ఉన్నారు. మరో విషయం ఏంటంటే, ముక్కుసూటిగా ఉండే ఆదిమూలం మీద ఎవ్వరినీ లెక్కచేయరన్న ముద్ర ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరి దూకుడు మనస్తత్వం ఆదిమూలానికి మరన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. దీంతో తమ పరిస్తితి ఏంటో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.