
ఆయన ఓ మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్.. మూడు నియోజకవర్గాలలో ఎంతో పట్టుకున్న వ్యక్తి .వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం నానా విధాలుగా ప్రయత్నించాడు. ఒక సమయంలో ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిగా కూడా నియమించారు వైసీపీ పెద్దలు. ఇక పోటీ చేయటమే తరువాయి అనుకున్న తారుణంలో మరొక ఇన్చార్జిని అక్కడ పెట్టి అతనిని నిరాశపరిచారు. పోనీ వేరే చోట అయినా ఇన్చార్జి ఇస్తారు అనుకుంటే అది లేదు.. అవసరానికి ఆయన్ని బాగా వాడుకున్నారు కోట్ల రూపాయల ఖర్చు పెట్టించారు. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో వైసీపీకి తన సత్తా చూపించాలని డిసైడ్ అయిన ఆ నేత, గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి మూడు నియోజకవర్గాల్లో సైకిల్ విజయం వెనుక కీలక వ్యక్తిగా మారారు. ఇంతకీ ఎవరాయన.
మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సొంత నియోజకవర్గం ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహీస్తున్న ఆత్మకూరు. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక అప్పటి నుండి వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కీలక వ్యక్తిగా మారారు. తనకున్న ఆర్థిక,.అంగ బలంతో కచ్చితంగా గత ఎన్నికల్లో ఎంఎల్ఏ టికెట్టు వస్తుంది అనుకున్నారు. వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి టిక్కెట్ పక్కా అని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.
ఉదయగిరి నియోజకవర్గ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ అధిష్టాన సస్పెండ్ చేయడంతో ఆ టికెట్ ధనంజయ రెడ్డికే అని వైసీపీ పెద్దలు మాట కూడా ఇచ్చారట. దీంతో ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను ధనుంజయ రెడ్డి చుట్టేశారు. అప్పట్లో వైసిపి అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. భారీగా ఖర్చు చేస్తూ పార్టీని పరుగులు పెట్టించాడు. అయితే ఉదయగిరి టిక్కెట్ మేకపాటి కుటుంబానికి ఇస్తామన్న వైసీపీ అధిష్టానం, వెంకటగిరి సీటు ఇస్తామని ప్రామిస్ చేసింది. అయితే అక్కడ వైసిపి అధిష్టానం మేకపాటి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడంతో వెంకటగిరి టిక్కెట్ ఆశించాడు. అయితే అది కూడా బూం రాంగ్ అయింది. ఆ టిక్కెట్ నేదురమల్లి రాంకుమార్ రెడ్డికి ఇచ్చింది వైసీపీ అధిష్టానం.
వైసీపీ చర్యలతో మండిపడ్డ ధనుంజయ్ రెడ్డి, వైసీపీని జిల్లాలో దెబ్బతీయాలని డిసైడ్ అయ్యారు. జగన్ పార్టీని వదిలి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రేసుగుర్రం లాగా టిడిపిని పరుగులు పెట్టించాడు. ఈ మూడు చోట్ల కూడా తెలుగుదేశం విజయం వెనుక కీలకంగా మారారు. అంతేకాదు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం వెనక కూడా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి కీలకంగా మారారు. తనను దూరం చేసుకున్న వైసీపీకి చుక్కలు చూపించారు ధనుంజయ్ రెడ్డి. ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకున్న సీఎం సీఎం చంద్రబాబు రెండోసారి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి ధనుంజయ్ రెడ్డికి అప్పగించారు. తెలుగుదేశం పార్టీలోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ నేతగా మారిన ధనుంజయ రెడ్డి, నిబద్ధతకు, నిజాయితీకి, కష్టానికి చంద్రబాబునాయుడు కానుక ఇచ్చినట్లు జిల్లా ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేసే అవకాశం కచ్చితంగా ఇస్తానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.