ఆ ఎమ్మెల్యే మౌనం వెనుక కారణమేంటి..?

ఆ ఎమ్మెల్యే స్ట్రైలే వేరు. అభివృదే తన ఎజెండా.. ప్రతిపక్షాల విమర్శలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయడమే ఆయన నైజం..అయితే ఆయన ఇలాకాలో విచ్చలవిడిగా జరిగే మైనింగ్ అక్రమ రవాణా విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఆయన్ను వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీని పరుగులు పెట్టించడంలో మంచి మేధావి అయినా…నెల్లూరు జిల్లాలో జరిగే అక్రమ మైనింగ్ 99 శాతం ఆయన నియోజకవర్గంలోనే జరగటం ఆయనకు ఒక పెద్ద మైనస్ గా మారిందట. ఇంతకీ ఆ నియోజకవర్గ ఏది? ఏ నాయకుడు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

నెల్లూరు జిల్లాలో జరిగే అక్రమ మైనింగ్ వ్యవహారం వందకి 99 శాతం వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో జరుగుతుందని ప్రతి నోటా వినిపిస్తున్న మాట. ఇక్కడ తెల్లరాయి.. సిలికాన్.. గ్రావెల్..ఎర్రచందనం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటి అక్రమ రవాణాను అరికట్టవలసిన స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ ప్రతి నోటా జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 50 రోజుల నుండి పరారీలో ఉన్నారు. మరో మాజీ మంత్రిని రేపో మాపో అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసైగల్లోనే ఈ అక్రమ మైనింగ్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే తో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హస్తం కూడా ఉందని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇటీవల ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే… కోట్లాది రూపాయల మైనింగ్ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిపోతుంటే.. ఎమ్మెల్యే రామకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించడం బాగానే ఉంది. కానీ.., అక్రమ మైనింగ్ ను అరికట్టడంలో మాత్రం విఫలం అయ్యారని విమర్శిస్తున్నారట. నియోజకవర్గంలో వైసిపి ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాత్రం స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా ఇంత దారుణం జరుగుతుందా అని ప్రెస్ మీట్‎లు పెట్టి మరీ దుమ్మెత్తి పోస్తున్నారు. అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తున్నా.. గట్టిగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు.

సైదాపురంలో జరిగే అక్రమ మైనింగ్ ను పరిశీలిస్తానని అక్కడే కూర్చుని దీక్ష చేస్తానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనడంతో ఇటీవల ఆ మైనింగ్ వద్ద వందలాది మంది పోలీసులు కూడా కాపలా కాయటం విశేషం. నియోజకవర్గ ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రామకృష్ణ మైనింగ్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడంతో బాగా చెడ్డ పేరు తెచ్చుకున్నట్లు టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ఉండే పెద్దారెడ్లు తమ నియోజకవర్గంలో పడి విచ్చలవిడిగా దోచుకుంటుంటే తమ ఎమ్మెల్యేకు మాత్రం చెడ్డ పేరు వస్తుందని వెంకటగిరి నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి చూడాలి ఇప్పటికైనా ఎమ్మెల్యే రామకృష్ణ అక్రమ మైనింగ్ పై ఎలా రియాక్ట్ అవుతారో.