
అధికారం ఉంది కదా అని ఆ ఎమ్మెల్యే మేయర్ పై బెదిరింపుల పర్వానికి దిగుతున్నారా?. నగరపాలక సంస్థలో అవినీతి జరిగింది అని హెచ్చరికలతో మేయర్ ను సరెండర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా?. అయితే ఏమాత్రం తగ్గేదేలే..ఏ చిన్న అవినీతి జరిగినా దానిపై విచారణకు సిద్ధం అని మేయర్ కూడా సవాల్ విసురుతున్నారా? ఎమ్మెల్యే కు ఘాటైన సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారా? ఇలా ఆ నగరంలో ఎ మ్మెల్యే వర్సెస్ మేయర్ గా పాలిటిక్స్ హాట్ గా మారాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మేయర్ ను ఎందుకు టార్గెట్ చేశారు? అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
అనంతపురంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. రెండు నెలల క్రితం మేయర్ పై అవిశ్వాస తీర్మాణం అంటూ హడావుడి సాగింది. అప్పట్లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ ను టార్గెట్ చేసుకుంటూ ఓ వైపు ఎమ్మెల్యే మరోవైపు సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు విమర్శలు చేశారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మాణానికి తగినంత బలం లేక చేతులు కాల్చుకున్నారు. ఈవివాదం సమిసిపోక ముందే మరోసారి మేయర్ టార్గెట్ గా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డంపింగ్ యార్డ్ లో అవినీతి గురించి మాట్లాడుతూ మేయర్ వసీం కు వర్నింగ్ ఇచ్చారు . దీనికి మేయర్ కూడా గట్టిగానే బదులిచ్చారు. మరోవైపు మేయర్ చేసిన వ్యాఖ్యల మీద కొందరు టీడీపీ గూటికి చేరిన కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ మాటల యుద్ధంతో అనంతలో మళ్లీ పొలిటికల్ హీట్ కనిపిస్తోంది…
ఇటీవల కడప మేయర్ 36లక్షల అవినీతి చేశారంటూ అక్కడ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు విచారణలో తేలడంతో మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అనంతపురం మేయర్ వసీం సలీంకి ఇదే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరపాలక సంస్థలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన గత ఐదేళ్లలో నగరపాలక సంస్థను పూర్తిగా బ్రష్టు పట్టించారని… కేవలం 11 నెలల్లోనే దీనిని గాడిలో పెట్టినట్టు తెలిపారు. గత ఐదేళ్లలో కనీసం చిన్న డ్రైన్ తీయలేదని, రోడ్లు, కాల్వలు నిర్మించలేదని విమర్శలు చేశారు. డంపింగ్ యార్డ్ లో మేయర్ వసీంతో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 22 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని… ఇందులో 9కోట్ల రూపాయల వరకు నిరూపితమైందని.. త్వరలోనే రిపోర్టు రానుందన్నారు. కడప మేయర్ చేసిన 36లక్షల అవినీతికే పదవి కోల్పాయారన్నారు. ఇక్కడ డమ్మీ మేయర్ మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతిపై కూడా చర్యలు తప్పవన్నారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల మీద మేయర్ వసీం సీరియస్ గానే స్పందించారు. సహజంగా ఏ అంశం మీద అయినా సున్నితంగా స్పందించే మేయర్ ఈసారి మాత్రం ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఏడాది కాలంలో ఒక్క రూపాయి నిధులు తీసుకురాకున్నా వైసీపీ హయాంలో మంజూరు అయిన పనులు,తమ పాలక వర్గం ఆమోదించిన పనులు ప్రారంభిస్తూ కూటమి పాలనలోనే నగరంలో అభివృద్ధి జరుగుతోందని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. డంప్ యార్డ్ లో మాజీ ఎమ్మెల్యే, తాను 9 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతున్నారని బిల్లులు చెల్లించిందే 11 కోట్లు లోపు అయితే 9 కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. మీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా త్వరితగతిన విచారణ జరిపించాలని ఆయన సూచించారు.
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని విమర్శించే స్థాయి దగ్గుపాటికి లేదన్నారు. ఏడాది పాలనలో నీవు చేసిన అవినీతి, అక్రమాల చిట్టా మా వద్ద ఉందని సందర్భం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను మేయర్ వసీం హెచ్చరించారు. ఇక పదే పదే తనను డమ్మీ మేయర్ అంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు మైనార్టీలు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు.తన హయాంలో నగరంలో 1045 కోట్ల అభివృద్ధి జరిగిందని,మీ హయాంలో ఒక్క రూపాయి తీసుకురాలేక పోయావని నీవు డమ్మివా,నేను డమ్మివా అని గుర్తించుకోవలన్నారు. మా హయాంలో 50 డివిజన్ ల పరిధిలో జరిగిన అభిరుద్దిపై బుక్ రూపొందించామని,నీకు కూడా పంపిస్తా చూసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ కు సూచించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరంటూ మేయర్ ఘాటుగానే స్పందించారు.