
రాజకీయం మారిపోయింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒక నాడు చిరునామాగా నిలిచిన పల్నాడు గడ్డపైన కొత్త రాజకీయం ఆవిష్కృతం అయింది. ఉప్పు నిప్పులా పోరాటం సాగించిన రెండు రాజకీయ కుటుంబాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. వేర్వేరు పార్టీల్లో ఉంటూ బద్ద శత్రువులుగా కొనసాగిన ఆ రెండు ఫ్యామిలీలు కలిసి కట్టుగా సాగుతున్నాయి. ఈ అరుదైన కలయికతో ఒక్క సారిగా రాజకీయం మారిపోయింది. అధికార పార్టీకి కంచుకోటగా మార్చింది. అంచనాలకు భిన్నంగా ఒక్కటైన ఆ రెండు కుటుంబాలు ఎవరివి..? ఎలా కలిసారు..? ఏంటసలు ఆ కథ..లెట్స్ వాచ్
ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కోడెల – కన్నా లకు రాజకీయంగా పెద్ద చరిత్రే ఉంది. కోడెల అంటే టీడీపీ.. కన్నా అంటే కాంగ్రెస్. ఇద్దరూ గుంటూరు జిల్లా రాజకీయాలను సింగిల్ హ్యాండ్ తో నడిపించిన నేతలు. టీడీపీ ఆవిర్భావం నుంచి నర్సరావుపేట కేంద్రంగా జిల్లా రాజకీయాల్లో కోడెల తనదైన ముద్ర వేసారు. అదే సమయంలో కాంగ్రెస్ అంటే కన్నా అన్నట్లుగా గుంటూరు జిల్లాలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు కన్నా లక్ష్మీనారాయణ. 2014 వరకు జిల్లాలో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయం ఉప్పు – నిప్పులా సాగింది. నేరుగా రాజకీయంగా తల పడకపోయినా.. ఇద్దరి మధ్య రాజకీయ వైరం మాత్రం ఒక రేంజ్ లో ఉండేది. పార్టీ కేడర్ కు ఈ ఇద్దరూ… జిల్లాలో రెండు పార్టీలకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని విధంగా ఐక్యతా రాగం తో కొత్త రాజకీయం మొదలైంది.
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుండి పోటీ చేయగా కన్నా లక్ష్మీనారా యణ బిజెపి నుండి నర్సరావుపేట ఎంపిగా పోటీ చేశారు. కోడెల ఆ ఎన్నికల్లో గెలిచి స్పీకర్ గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన భౌతికంగా దూరమయ్యారు. అనూహ్యంగా 2024 ఎన్నికల ముందు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. కోడెల మరణం తరువాత ఆయన కుమారుడు శివరామ్ సత్తెనపల్లి టీడీపీ సీటుపైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. టీడీపీలో చేరిన సమయంలోనే కన్నాకు సత్తెనపల్లి సీటు పైన హామీ దక్కింది. దీంతో, ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కోడెల శివరాం చంద్రబాబు,లోకేష్ ల వైఖరిపై పలు విమర్శలు సైతం చేశారు. కాగా, ఆ తరువాత శివరాం భవిష్యత్తుపై చంద్రబాబు భరోసా ఇవ్వడంతో కోడెల శివరాం ఎన్నికల బరి నుండి తప్పుకున్నారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నుండి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కన్నా టిడిపిలో చేరకముందు నుండే కోడెల శివప్రసాద్ పేరు చేరిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కన్నా గుర్తించారు.
దీంతో కన్నా టిడిపిలో చేరిన దగ్గర నుండి కోడెల పేరు వినపడేలా చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఎన్నికల తర్వాత కూడా కన్నా వివిధ గ్రామాల్లో కోడెల విగ్రహాలను ఏర్పాటు చేయిస్తూ వస్తున్నారు. కూటమీ ప్రభుత్వ కొలువు దీరిన తర్వాత ఒకటి రెండు చోట్ల సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల విగ్రహాల వివాదాలు తలెత్తినా… మాజీ మంత్రి కన్నా తనదైన శైలిలో వాటికి ముగింపు పలికారు. భీమవరంలో కోడెల ప్లెక్సి తొలగింపు, రుద్రవరంలో విగ్రహా వివాదాలు సమసిపోయాయి. ఇక అప్పటి నుండి కన్నా లక్ష్మీ నారాయణ, కోడెల శివరాం మద్య సఖ్యత కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహం తో పాటు కోడెల శివప్రసాద్ విగ్రహాలను కన్నా ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కోడెల శివరాం కూడా పాల్గొన్నారు. కన్నా కోడెల శివరాం పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవటాన్ని కూడా అభిమానులు గమనించారు. అయితే నియోజకవర్గంలో ఎక్కడ కోడెల విగ్రహావిష్కరణ జరిగినా అక్కడకి శివరాం కన్నాతో పాటే పాల్గొంటున్నారు. కుందులవారి పాలెం, బలిజేపల్లి, సత్తెనపల్లిలో గత రెండు వారాల వ్యవధిలో కోడెల, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
కూటమీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివరాం ఎక్కడా బహిరంగంగా పార్టీ మీద కాని కన్నా మీద కాని విమర్శలు చేయలేదు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా శివరాం కనిపించడం లేదు. ఒకవైపు కన్నా కోడెల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే వీరిద్దరి మధ్య ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందో చూద్దాంలే అని వారి ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రెండు బలమైన రాజకీయ కుటుంబాలు కలిసిమెలిసి పనిచేయడం క్యాడర్ లో జోష్ నింపుతోంది.