కూటమి ప్రజా ప్రతినిధుల మాటను పెడచెవిన పెడుతున్నారా..??

పల్నాడు పోలీసుల్లో వైసిపి కోవర్టులు ఉన్నారా..? ప్రభుత్వం మారి ఏడాదైనా పోలీసుల వైఖరిలో మార్పు కనిపించడం లేదా..? కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల మాటను సైతం పెడచెవిన పెడుతున్నారా..? ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో శాంతిభద్రతల పరిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలేదా? పోలీసుల పంచాయితీ ముఖ్యమంత్రి వరకు వెళ్లిందా? జిల్లా పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళణ కార్యక్రమం జరిగే సూచనలు కనిపిస్తున్నాయా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

పల్నాడు జిల్లా రాజకీయాలు రోజు రోజుకు చిత్రవిచిత్రంగా తయారవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఆయా ప్రభుత్వశాఖల పై అధికారపార్టీ నేతలకు ఇంతవరకు పట్టు దొరకలేదనే వాదనలు జిల్లా వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పోలీసు శాఖలోనైతే అధికార కూటమి పార్టీలోని ప్రజాప్రతినిధుల ఫోన్ లు కూడా రిసీవ్ చేసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు జిల్లా పోలీస్ శాఖలోని కొందరు అధికారులు ఇప్పటికీ వైసిపి కోవర్టులు గానే వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

అత్యవసర సందర్భాలలో కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీస్ బాస్ కి ఫోన్ చేసినా ఆయన సిబ్బంది ఫోన్ అటెండ్ చేసి సార్ బిజీగా ఉన్నారు అంటూ ముక్తాయిస్తున్నారని కూటమి నేతలు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లా పోలీస్ బాస్ కు కళ్ళు చెవుళ్లా వ్యవహరించే స్పెషల్ బ్రాంచ్ లోని ఒకరిద్దరు అధికారులు తాము అందిచే సమాచారంలో వాస్తవాలను కప్పిపుచ్చి మొత్తం పోలీసు వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో టిడిపి లోని రెండువర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరువల్లనే హత్యలు జరిగాయని పోలీస్ బాస్ హడావిడిగా ఇచ్చిన స్టేట్మెంట్ అధికారపార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కల్పించుకుని ఈ హత్యల వెనుక వైసిపి నేతల హస్తం ఉందని,హత్య కేసులో నిందితుల బ్యాంక్ ఎకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అయ్యాయనీ..ఆ డబ్బు ఎవరు పంపించారో నిజానిజాలు తేల్చాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించుకుని వారిని కూడా హత్య కేసులో నిందితులుగా చేర్చడం చర్చాంశనీయంగా మారింది.

ఇదిలా ఉంటే బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి పల్నాడు జిల్లా పోలీసు అధికారుల తీరు పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎలక్షన్ల తర్వాత జరిగిన అల్లర్ల కేసులో బెయిల్ వచ్చేవరకు పిన్నెల్లి సోదరులు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగడంలో పల్నాడు జిల్లా లోని కొందరు పోలీసు అధికారుల ప్రమేయం తప్పకుండా ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరో సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సైతం పోలీసుల వ్యవహారశైలి పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఆయన సైతం ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరే కాదు మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కొంతమంది పోలీసు అధికారులు, సిబ్బంది వైసీపీ కోవర్టులుగానే వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకంటే వైసిపి వారికే త్వరగా పనులు చేసిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా పల్నాడు జిల్లాలో.. వైసిపి కోవర్టుల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని,కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో శాంతిభద్రతల పరిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని జిల్లా నేతలు కొరుతున్నారు. ఇక మరో వైపు వైసిపి కోవర్టులు గా ఉన్న పోలీసుల పై ఖఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో రానున్న రోజులలో జిల్లా పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళణ కార్యక్రమం జరిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు అధికారపార్టీ నేతలు.