భగ్గుమంటున్న రాప్తాడు రాజకీయాలు…

సీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లు రాప్తాడులో ఆయనే రాజ్యమేలాడు… గత ఎన్నికల్లో ఆయన పరాజయం పాలవ్వడం, రాష్ట్రంలో సర్కార్ మారిపోవడంతో లోకల్‌గా పొలిటికల్ సీన్ మారింది. దాంతో ఆయన ఫేట్ కూడా మారిపోయింది. ఇప్పుడు.. అరెస్టులతో రాప్తాడు మరోసారి హీటెక్కుతోంది. నిజానికి ఉగాది నుంచి అక్కడ ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రాప్తాడు అంత హీటెక్కడానికి కారణం ఏంటి?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు రాజకీయాలు ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటాయ్. ఇది.. ఆంధ్రా మొత్తం తెలిసిన ముచ్చటే. ఎందుకంటే.. అన్ని చోట్లా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగే రాజకీయం.. రాప్తాడుకొచ్చేసరికి మరోలా మారిపోతుంది. ఇక్కడ.. పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య పొలిటికల్ వార్ పీక్‌లో ఉంటుంది. తెలుగుదేశం నుంచి పరిటాల సునీత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2014 ఎన్నికల్లో.. పరిటాల సునీత 3 సార్లు ప్రకాశ్ రెడ్డిపై గెలుపొందారు. కానీ.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. తోపుదుర్తి బ్రదర్స్ లోకల్ పాలిటిక్స్‌ని శాసించారనే ప్రచారం ఉంది. ఐదేళ్ల పాటు వాళ్లు ఏం చెబితే అది జరిగిందనే టాక్ ఉంది. కానీ.. ఇది ఎంతో కాలం కొనసాగలేదు.

2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలినా.. రాప్తాడులో ఆ పార్టీ ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఇందుకు.. ఓ ఇంటర్వ్యూలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే.. మీసం తీసేస్తానని సవాల్ విసిరారు. ఫలితాల తర్వాత తోపుదుర్తి మాట మార్చడంతో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ తర్వాత.. కొద్దిరోజుల పాటు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నాయ్ రెండు వర్గాలు. కానీ.. రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. చినికి, చినికి గాలివానలా మారింది. అప్పుడు.. సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా.. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చాలక.. ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి.. సరిగ్గా ఎన్నిక జరిగే సమయానికి తీసుకురాలేక.. మరో రోజుకి వాయిదా వేయించారు.

ఆ తర్వాతి రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక్కడే.. అసలు కథ మొదలైంది. అదే రోజు.. పెనుగొండ ఎమ్మార్వో ఆఫీస్ కేంద్రంగా ఓ రభస జరిగింది. పోలీసులను బూతులు తిట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఇక.. అక్కడి నుంచి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా.. తోపుదుర్తి వర్సెస్ పోలీసుల్లా మారిపోయింది వ్యవహారం. ఎక్కడికి వెళ్లినా.. పోలీసుల్ని తిట్టడం ప్రకాశ్ రెడ్డికి అలవాటైపోయిందని పోలీస్ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయ్. అదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావడం, జగన్ తిరిగి వెళ్లే సమయంలో.. హెలికాప్టర్ భాగాలు దెబ్బతినడంతో మొదలైంది అసలైన రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే.. హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే.. వైసీపీ కార్యకర్తలను కావాలనే ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టారని.. తెలుగుదేశం నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. పోలీసులు అరెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ హెలికాప్టర్ ఘటన కేసులో.. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయ్. ఇప్పుడు వారందరినీ అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సుమారు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించేందుకు కోర్టులో హాజరుపరచగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు రావడంతో.. ఆయన హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో.. ప్రకాశ్ రెడ్డి అరెస్టులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ.. సత్యసాయి జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయ్యిందట. దాంతో.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అగమేఘాలపై హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు ప్రత్యేక బృందాలు వెళ్లాయట. కానీ.. ప్రకాశ్ రెడ్డి మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి.. బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారట.

మొదట బెయిల్ కోసం కాకుండా.. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారట. అది విచారణకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. బెయిల్ పిటిషన్ కూడా వేశారట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రకాశ్ రెడ్డి.. జనాన్ని కంట్రోల్ చేసే వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగానూ.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా హైకోర్టుకు విన్నవించారట. ఆయన్ని విచారిస్తేనే.. మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని.. కోర్టును కోరుతున్నారట. దాంతో.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలో అరెస్ట్ టెన్షన్ మొదలైంది. కోర్టు గనక పోలీసులకు అనుకూలంగా ఆదేశాలిస్తే.. తన అరెస్ట్ ఖాయమనే ఆందోళనలో ఉన్నారు. మరి.. ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుంది.? తోపుదుర్తి గనక అరెస్ట్‌ అయితే.. రాప్తాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.. ఆసక్తిగా మారింది.