
తాడేపల్లిగూడెంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన కూటమి నేతల మధ్య అసంతృప్తికి అద్దం పడుతోంది. తాను చనిపోతే బైఎలెక్షన్ కోసం కొందరు ఎదురు చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు తాడేపల్లిగూడెంలో బై ఎలక్షన్ కోసం ఎదురుచూస్తున్నది ఎవరు? తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చనిపోవాలని కోరుకుంటుంది ఎవరు? ఆ జనసేన ఎమ్మెల్యే ఆవేదన వెనుక లెక్కలేంటి?
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత ఘన విజయాన్ని సాధించాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి స్నేహం 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని.. మళ్లీ, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచు అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణుల మధ్య అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ బాహుబలి అని ప్రేమగా పిలుచుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి అద్దంపడుతున్నాయి.
చాలా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానని, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎమ్మెల్యే అయిన తాను ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకుంటున్నాని బొలిశెట్టి శ్రీనివాస్ మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. అలాంటాయన తాను చనిపోతే బాగుండు, బైపోల్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేగా తనను ప్రజలు గెలిపించుకున్నారని, ఎవరు త్యాగం చేస్తేనో తాను ఎమ్మెల్యే అవ్వలేదని చురకలు అంటించారు.
అసలు బొలిశెట్టి శ్రీనివాస్‌ను అంత మానసిక క్షోభకు గురి చేసింది ఎవరు అనేదానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలతో జనసేన, టీడీపీల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ టీడీపీ నాయకులు, అటు ఎమ్మెల్యేతో పాటు జనసేన ముఖ్య నేతలు మధ్య అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవం అంటున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి బొలిశెట్టి శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్నారు. మిత్రపక్షాలకు ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇటు ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కసారిగా ఆవేదనతో మాట్లాడటంతో అసలు ఏమైంది అనే దానిపై రాష్ట్ర నేతలు సైతం ఆరా తీయటం మొదలు పెట్టారంట
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టిడిపి సైతం బలోపేతంగా ఉంది.. వైసిపి హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను ఎదుర్కోవటంలో జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జి తమదైన శైలిలో పోరాడారు. అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కూటమి ఏర్పడిన తర్వాత తాడేపల్లిగూడెం టికెట్‌ని అనూహ్యంంగా జనసేన కైవసం చేసుకుంది. కూటమి వేవ్ కలిసి వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలిచారు.
టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వలవల బాబ్జికి ఏడాది కావస్తున్నా ఏ పదవి ఇవ్వకపోవడంపై టిడిపి నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. బాబ్జి తనకు పదవుల మీద ఆశ లేదంటూనే తనదైన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో ప్రయత్నాలు చేయటం ఇటు జనసేన నేతలకు కొంత ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి తన ఇంట్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం పెట్టడం ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు నచ్చలేదట.
మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుండి వచ్చే బలమైన నేతలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ నుండి జనసేనలోకి వలసలు పెరగడంతో వలవల బాబ్జి తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. ఇటీవల నియోజకవర్గంలో జిల్లా అధికారుల పర్యటన సమయంలో వలవల బాబ్జిని పిలవలేదంట. దాంతో ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు వల్లే.. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారంట. టీడీపీ నేతలు అక్కడ, ఇక్కడ మాట్లాడిన మాటలు నేరుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెవిన పడటంతో ఆయన మనోవేదనకు గురయ్యారని జనసైనికులు చెప్తున్నారు.
తమకన్నా టీడీపీ నేతలకే బొలిశెట్టి శ్రీనివాస్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నా వారు ఇంకా విమర్శలు చేయడాన్ని జనసేన పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంట. నియోజకవర్గంలో పై చేయి కోసం అన్నట్లు ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు బహిరంగ విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేకి తెలియకుండా టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి తమ పనులు చేయాల్సిందేనని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరిస్తున్నారంట. అధికారులు ఇదే విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లడంతో టీడీపీ, జనసేన మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిర్గతం అయిందంటున్నారు..
రాష్ట్రస్థాయిలో చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేసుకుంటూ, సమన్వయంతో పనిచేస్తుంటే కింది స్థాయిలో నేతలు పెట్టుకుంటున్న గిల్లికజ్జాలలు, పంచాయతీలతో కూటమి శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయంట. జనసేన ముఖ్యనేతలు సైతం బొలిశెట్టి శ్రీనివాస్‌తో టచ్‌లోకి వచ్చి ఏం జరిగిందన్న దానిపై ఆరాలు తీస్తున్నారంట.
టీడీపీ నేతలతో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, కూటమి నేతల సమావేశంలో వాటిని ప్రస్తావించి ఇబ్బందులు లేకుండా చేస్తామని జనసేన ముఖ్యులు బొలిశెట్టికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఘా విభాగాల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నేతలతో మీటింగ్ పెట్టి పరిస్థితి చక్కదిద్దుతారన్న టాక్ వినిపిస్తోంది. అసలు ఈ రచ్చ అంతటికీ కారణం రాబోయే మున్సిపల్ ఎన్నికలే అంటున్నారు. ఆ ఎన్నికల వాటాల్లో జనసేనపై పైచేయి సాధించేందుకే టీడీపీ నేతలు ఇప్పటి నుంచి పావులు క