గుంటూరు మిర్చి యార్డ్ పీఠం దక్కేదెవరికి..?

గుంటూరు రాజకీయాల్లో మిర్చి ఘాటు తగులుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆశావాహులు భారీగా ఉండటంతో.. పోటీ మంచి రసవత్తరంగా మారింది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే తరువాత చెప్పుకోదగిన పదవి కావడంతో ఈ పదవి కోసం కూటమి నేతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కూటమి నేతల రాజకీయం సై అంటే సై అనే స్థాయికి చేరాయి. చైర్మన్ పదవిపై అటు ఎంపీ, ఎమ్మెల్యే సైతం చక్రం తిప్పేందుకు తమదైనశైలిలో పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్‌ నేతలలకు పదవులు కట్టబెట్టేందుకు అధిష్టానం చూస్తోందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ పదవులు ఎవరిని వరిస్తాయి. కూటమి సర్కార్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

ఆసియాలో అతిపెద్ద మిర్చియార్డ్ గుంటూరులో ఉంది. ఈ యార్డ్ చైర్మన్ పదవి దక్కించుకోవడం ఓ ప్రైడ్ గా ఫీల్ అవుతారు అక్కడి నేతలు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే తరువాత చెప్పుకోదగిన పదవి కావడంతో ఈ పదవి కోసం కోసం కూటమి నేతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. తమకంటే తమకు చైర్మన్ పదవి అంటూ ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ప్రతిష్టాత్మక మిర్చి యార్డ్ చైర్మన్‌ పదవి కోసం ఆశావహులు కోటి ఆశలతో ఉన్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు ఈ పదవిపై కన్నేశారు. ఇటీవల గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాదవి గత ప్రభుత్వం హయాంలో మిర్చియార్డ్ లో భారీగా స్కాంలు జరిగాయి అంటూ లెక్కలతో సహా ఓ చిట్టా రాసి ఇంఛార్జ్ కలెక్టర్ కు అందచేశారు. భారీ ఆదాయం వనరుగా పేరుగాంచిన యార్డ్ చైర్మన్ గా పదవి దక్కించుకుని తమ హవా సాగించాలని కొందరు నేతలు ప్రయత్నింస్తుంటే… అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ దశలో చైర్మన్ గా పదవి చేపట్టటం అవసరమా అంటూ కొందరూ నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీలో వేగం పెరిగింది. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిపై టీడీపీ, జనసేన మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. టీడీపీ నేతలు ఈ పదవికి లాబీ చేస్తుండగా, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పేరు తెరమీదకు వచ్చింది. ఏ పార్టీ అభ్యర్థికి పదవి దక్కనుందనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. పార్టీకి అంకితభావంతో పనిచేసిన నేతకు కీలక బాధ్యత అప్పగించే ఆలోచన చేస్తోందట టిడిపి అధిష్టానం . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల కమిటీల పునర్నియామక ప్రక్రియ ఊపందుకుంది.ఈ పదవిపై పలువురు ఆసక్తి చూపుతున్నప్పటికీ, టీడీపీ నుంచి ముత్తినేని రాజేష్, వెన్నా సాంబశివారెడ్డి, ఉగ్గిరాల సీతారామయ్య, సుఖవాసి శ్రీనివాసరావు పేర్లు చైర్మన్ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది.

గుంటూరు జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల దృష్టికి సీనియర్ నేతల పేర్లు తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ కోసం చేసిన సేవలు, సమస్యల పరిష్కారంలో వ్యవహరించిన తీరును అధిష్టానం పరిశీలిస్తుందని తెలుస్తోంది. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ పదవిని పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసేవారికి అధిష్టానం పెద్దపీఠ వేస్తుందన్న అభిప్రాయం క్రింది స్థాయి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఈ వారంలోనేగుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. జిల్లా నేతల అభిప్రాయాలు అధిష్టానం సేకరించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువమంది ముత్తినేని రాజేష్, వెన్నా సాంబశివారెడ్డి పేర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి సూచించినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుత రాజకీయపరిణామాలు చూస్తే, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి సాంబశివారెడ్డికి ఖాయమన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

వైసీపీ హయాంలో మిర్చి యార్డులో జరిగిన అక్రమాలు, అడ్డగోలు లైసెన్స్ మంజూరు పై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు వినతిపత్రం అందచేశారు.వైసీపీ హయాంలో యార్డును దోచుకున్నారని ఎమ్మేల్యే మాధవి ఘాటుగా విమర్శించారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్చియార్డ్ కు చైర్మన్ పదవి చేపట్టటం అవసరమా అని చాలా మంది నేతలు భావిస్తున్నట్లు సమాచారం. పదవి చేపట్టటం ఓ ఎత్తు అయితే… ఇప్పుడు ఈ అవినీతి మరకలు ఉన్న పదవిని చేపట్టి మరిన్ని తలనొప్పులు తెచ్చుకోవాలా అని భావిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.

గుంటూరు జిల్లాలో కుల ప్రాతిపదికన పదవులు ఇస్తూ వస్తుంది కూటమి అధిష్టానం. టీడీపీలో ఇప్పటికే నగర మేయర్ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వగా, డీసీఎంఎస్ చైర్మన్ పదవి కాపు వర్గానికి ఇచ్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బీసీ జనరల్‌ లేదా రెడ్డి సామాజిక వర్గానికి మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యార్డును బీసీలకు కేటాయించిననున్నట్లు రెండు రోజులుగా వార్తల వస్తున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎవరికి వారు ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా, సీనియారిటీ, విధేయత తదితర అంశాల ఆధారంగానే చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి .