గుంటూరులో 200 పైగా సచివాలయాలు శానిటేషన్..!

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది పనితీరు అస్సలు బాగోలేదట. తమ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయన్న సంగతి వారికి అర్థం కావడం లేదన్న ఆరోపనలు వస్తున్నాయి. ఓవైపు పలు వార్డుల్లో చెత్తాచెదారం పేరుకు పోతుంటే, మొక్కుబడిగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు నగర పాలక పరిధిలో దాదాపు 200 పైగా సచివాలయాలు ఉన్నాయి. శానిటేషన్, ఇంజనీరింగ్, సచివాలయ అడ్మన్ సెక్రటరీలు కార్పొరేషన్ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లడంతో పాటు రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. అలాగే మురికి కాల్వలు శుభ్రం చేయడం కూడా శానిటరీ సెక్రటరీ దగ్గరుండి చేయించాలి. కానీ కొన్ని సచివాలయ సెక్రటరీలు శానిటరీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

మరోవిషయం ఏంటంటే, కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎంఎల్ఏలు సైతం ప్రతి రోజూ శానిటరీ సిబ్బందిని పర్యవేక్షిస్తుంటారు. శానిటేషన్ సెక్రటరీలను వర్క్ విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. అయినా వారి తీరు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విధుల్లోకి చేరారు ఈ సిబ్బంది. గత ఎన్నికల సమయంలో వీరిలో కొంతమంది తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. మిగిలిన వారు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఒక్కొక్కరికీ 50 ఇళ్లు ఉండేవి. అయితే ఇందులో చాలా తక్కువ మందికి తమ పరిధి ఏంటో తెలుసు. మిగిలిన వారికి ఏఏ ప్రాంతాల్లోని ఇళ్లు తమ పరిధిలో ఉంటాయన్న సంగతి తెలియదన్న ఆరోపణలు వస్తున్నాయి.

గత ప్రభుత్వంలో సచివాలయ సిబ్బందికి పూర్తి స్వేచ్చ ఉండేది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వీరిని పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది పనితీరు గమనిస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కొన్ని వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుని కంపు కొడుతోంది. ఇప్పటికైనా వీరు తమ పద్దతి మార్చుకోవాలని జనం కోరుతున్నారు.