
టీడీపీకి కంచుకోటగ ఉన్న ఆ నియోజకవర్గంలో పార్టీకి బీటలు ఏర్పడుతున్నాయా? ఇంచార్జ్ తీరుతో క్యాడర్ లో అయోమయం నెలకొందా?
ఆయన అనుసరించే విధానాలతో నియోజకవర్గంలో పార్టీ మనగుడకు ముప్పు పొంచి ఉందా? కోవర్టులకు ప్రాధాన్యతనిస్తూ తెలుగు తమ్ముళ్లను పట్టించుకోవడం లేదా? ఇంచార్జ్ తీరుతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారా? ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఆ ఇంచార్జ్ ఎవరో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్ళపల్లికి టీడీపీ పెట్టని కోటగా ఉoడేది.ఇక్కడ పార్టీ క్యాడర్ పటిష్టంగా కూడా ఉండేది. అయితే 2024 ఎన్నికలకు ముందు ఊహించని రీతిలో టిడిపి అధిష్టానం, జయచంద్రా రెడ్డికి టికెట్ ను కేటాయించింది.జయచంద్రా రెడ్డి కార్యకర్తల పట్ల సానుకూలంగా లేకున్నా,పార్టీ కోసం క్యాడర్ మొత్తం ఆయన గెలుపు కోసం పని చేసింది. రాష్ట్రమంతా కూటమి సునామీ రావడంతో తెలుగుదేశం అభ్యర్థులందరూ దాదాపుగా విజయం సాధించారు.పెద్దిరెడ్డి కుటుంబంపై పూర్తి వ్యతిరేకత ఉండడంతో, తంబళ్లపల్లిలో టిడిపి విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు.అయితే జయచంద్రా రెడ్డి చేతకానితనం వల్ల మరోసారి తంబళ్లపల్లి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరలేకపోయింది.కనీసం కొన్ని మండలాలలో బూతు ఏజెంట్లను సైతం నియమించుకోలేకపోవడం ఆయన లోపాయికారి ఒప్పందానికి అర్థం పడుతుందని ఇప్పటికి పార్టీ కేడర్ మదనపడుతోందనే టాక్ ఉంది.
అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే అయినప్పటికి, టిడిపి నాయకులు, కార్యకర్తలల్లో మాత్రం నిరాశే నెలకొని ఉందనే చెప్పాలి.కొన్ని దశాబ్దాల నుండి తెలుగుదేశం పార్టీకి పనిచేసి అన్నివిధాల నష్టపోయిన తమకు కాంట్రాక్టు పనులు గానీ, పదవులు గానీ లభిస్తాయని, కేసుల నుంచి విముక్తి లబిస్తుందని ఆశపడ్డారు. కానీ జయచంద్రా రెడ్డి అందుకు విరుద్ధంగా, వైసిపి నాయకులకు లక్షలాది రూపాయల్లో కాంట్రాక్టు పనులు అప్పగించారు. ఇందుకు అనేక సాక్షాలు కూడా ఉన్నాయనే వాదన క్యాడర్ లో వినిపిస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులపైనే దౌర్జన్యం చేస్తూ దాడులు చేస్తుండడంతో అసలైన టిడిపి నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిపైన వివక్ష చూపుతూ, వారి వర్గం, వీరివర్గం అంటూ దూషిస్తున్నారని తెలుగుతమ్ముళ్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదే విధంగా పార్టీ కార్యక్రమాలను సైతం,తన వర్గీయులు కాకుండా మరొకరు నిర్వహిస్తే, బ్యానర్లు చించివేయడం, ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం, కేకులను తోసి వేయడం వంటి పనులు చేస్తుండడంతో ఇరువర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.
ఇటీవల తమ యువనాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో పలువురు నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికిరాత్రి ధ్వంసం చేయడం, జిల్లా ఇన్చార్జి మంత్రి బీ.సీ.జనార్దన్ రెడ్డి పర్యటన సందర్భంగా అంగళ్లు నుండి హార్శిలీ హిల్స్ వరకు ఓ టిడిపి నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ఉద్దేశపూర్వకంగా చించివేయడం, అతని అరాచకాలకి పరాకాష్టగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి బీ.సీ.జనార్దన్ రెడ్డి, తంబళ్లపల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా హార్సిలీ హిల్స్ లో జయచంద్రారెడ్డి అనుచరులు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఆ వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టాయి.
ఇకపోతే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి సన్నాహకంగా మొలకలచెరువులో నిర్వహించిన మినీ మహానాడుకు సీనియర్ టిడిపి నాయకులను ఆహ్వానించకుండానే తూతూమంత్రంగా జరిపి పార్టీ ప్రతిష్టను దిగజార్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి.మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి తొత్తుగా వ్యవహరిస్తూ,తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నాని టాక్. జయచంద్రారెడ్డిని తప్పించి, మరొకరికి తంబళ్లపల్లె నియోజకవర్గం పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పెద్దఎత్తున అధిష్టానానికి వినతులు వెళ్లాయని సమాచారం. చాలామంది తెలుగు యువత నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలపైన అనేక కేసులను వైసిపి ప్రభుత్వం బనాయించిందని…టిడిపి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా,ఇప్పటికీ ఆ కేసుల నుండి తమకు విముక్తి లభించలేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇక ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కలుగజేసుకుని.. వైసీపికి చెందిన వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. తెలుగుదేశం పార్టీని బ్రష్టు పట్టించాలని చూస్తున్న జయచంద్రారెడ్డి నుండి తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీని,కార్యకర్తలను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం సమస్యాత్మకంగా ఉన్న 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే త్వరలోనే తంబళ్లపల్లికి కొత్త ఇన్చార్జిని చూడబోతున్నామని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.