ఆ ఇద్దరి మధ్యా క్లబ్ గొడవ?

విశాఖ జిల్లాలో ఫిలింనగర్ క్లబ్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది… తనకు తెలియకుండా తన నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుకు క్లాస్ తీసుకున్నారు … గంటా ఒక్కో మాట అడుగుతుంటే సమాధానం చెప్పలేని విష్ణుకుమార్‌రాజు సైలెంట్‌గా ఉండిపోయి క్షమాపణ కూడా చెప్పారు… సారీ చెప్పిన కారు దిగకుండా వెళ్లిపోయిన గంటా రెండు రోజుల్లోనే విష్ణు కుమార్‌తో కలిసిపోయి నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు … వారిద్దరి మధ్య మధ్య అంత సఖ్యత కుదరడానికి ఓ ప్రజాప్రతినిధి ఎంట్రీనే కారణమంట.. ఇంతకీ ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వివాదానికి తెరదించింది ఎవరు?

ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వారు ఉండరు… ఓటమి ఎరగని రాజకీయ నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారినా తన పొలిటికల్ కెరీర్‌లో ఓటమి ఎరగని లక్కీలీడర్ అనిపించుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా ఓటమి తనను చూసి పారిపోతుందన్న ధీమాతో ఎన్నికల బరిలో దిగే గంటా శ్రీనివాసరావు ..ఈ మధ్యకాలంలో తాను చేస్తున్న పనులు, వ్యాఖ్యలతో వివాదాల్లో నిలుస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిషికొండపై జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్యాలస్ తలుపులు తెరచి, మీడియాకు చూపించిన గంటా శ్రీనివాస్ సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. మొన్నీ మధ్య విశాఖ టూ అమరావతి ..వయా హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ అంటూ … ఎక్స్‌లో ఆయన చేసిన పోస్టులపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి తోడు మున్సిపల్ అధికారులపైన నోరు పారేసుకోవడంతో ఈ మధ్య కాలంలో గంటా శ్రీనివాస్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు ఇటీవల గంట శ్రీనివాస్ తోటి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు అందరి సమక్షంలో .. మాట్లాడేది తోటి ఎమ్మెల్యేతో అనే విషయాన్ని కూడా మర్చిపోయి విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

బీజేపీ నుంచి విశాఖ నార్త్ నియోజకవర్గానికి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజు కూడా రాజకీయాల్లో సీనియర్ … ఆయన కూడా విమర్శలు చేయడంలో ఒక మెట్టు పైనే ఉంటారు… సమస్య ఏదైనా, తన ముందు ఏ నాయకుడు ఉన్నా ఆలోచించకుండా తనదైన స్టైల్లో నోటికి పని చెప్తుంటారాయన. ఆయన తనకు సంబంధం లేని భీమిలి నియోజకవర్గానికి చెందిన ఫిలింనగర్ క్లబ్ లీజు వ్యవహారంలో విష్ణు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడమే గంటా శ్రీనివాసరావుతో వివాదానికి కారణమైంది… గంటా, విష్ణుల మధ్య బహిరంగంగా చోటు చేసుకున్న వివాదం పెద్ద దుమారమే రేపింది …

జీవీఎంసీ కౌన్సిల్లో డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానం గెలిచి బయటకు వస్తున్న సమయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌కువిష్ణుకుమార్ రాజు ఎదురయ్యారు… పక్కన సహచర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కూటమికి చెందిన కార్యకర్తలు అందరూ ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు… తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని ఫిలింనగర్ క్లబ్ లీజు వ్యవహారంపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ … ఇంకోసారి తన నియోజకవర్గ వ్యవహారాల్లో కలగజేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు…

సహచర ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కార్యకర్తల సమక్షంలోనే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే సైలెంట్‌గా ఉన్న విష్ణుకుమార్‌రాజు చేసేది లేక గంటాకు చివరకు క్షమాపణ కూడా చెప్పారు. విష్ణు సారీ చెప్తున్నా పట్టించుకోకుండా గంటా తన కారులో వేగంగా వెళ్ళిపోవడం చూస్తున్న వాళ్ళని సైతం అయోమయానికి, ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో గంట శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజుల మధ్య దూరం పెరిగిందని, అది రెండు పార్టీల మధ్య వైరానికి దారితీస్తుంది అనుకునే లోపే.. ఆ ఇద్దరు నేతలు ఒకే చోట కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ అసలు తమ మధ్య ఏమీ జరగనట్టే ముచ్చట్లు పెట్టుకోవడంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు

ఆ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ అంత తొందరగా కలిసి పోవడానికి కారణం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజే అంట … శాసనసభ పిటీషన్ల కమిటీ చైర్మన్‌గా తొలి సమావేశాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రఘురామకృష్ణరాజు .. కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొణతాల రామకృష్ణలను సమావేశానికి ఆహ్వానించారు… ఈ సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు ఇద్దరి మధ్య విభేదాలను తనదైన స్టైల్లో పరిష్కరించారంట.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అన్ని పార్టీల వారితో సత్సంబంధాలున్నాయి… టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు అటు జనసేన, బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తుండడంతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. అలాంటాయన ఆ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రఘురామ కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో సభను కూడా చాలా హుందాగా నడుపుతూ ప్రభుత్వంలో కీలకంగా మారుతున్నారన్న పేరు వస్తున్న నేపథ్యంలో … టిడిపి, బీజేపీ ఎమ్మెల్యేల వివాదానికి పరిష్కారం చూపించి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.

గంట, విష్ణుల విషయంలో రఘురామకృష్ణరాజు చొరవ తీసుకోవడంతో.. శాసనసభ పిటీషన్ల కమిటీ సమావేశం తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుకోవడంతో పాటు… ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును గంటా శ్రీనివాస్ తన ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారంట. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్న రాజకీయ వర్గాలు డిప్యూటీ స్పీకర్ పోషించిన పెద్దన్న పాత్రను అభినందిస్తున్నాయి… మొత్తానికి గంటా, విష్ణుల ఎపిసోడ్ సుఖాంతంగా ముగియడంతో విశాఖ కూటమి శ్రేణులు హ్యాపీ అయిపోతున్నాయంట