అమలాపురం జనసేనలో ఆ సీనియర్ నేత ఎవరు?

రాష్ట్రంలో జనసేనకు ప్రత్రిపక్ష హోదా ఉన్న ఒకే ఒక్క మున్సిపాలిటీ అమలాపురం. పార్టీ కి గుండెకాయ లాంటి అమలాపురంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఒక్కరికి కూడా నామినేటేడ్ పదవి రాలేదు సరికదా ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జి పదవి కూడా ఇంకా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. తాజాగా నామినేటెడ్ పదవులు ఇస్తున్న తరుణంలో… దేవస్థానం చైర్మన్ల భర్తీలో జనసేనకి కేటాయించిన ప్రతిష్టత్మాక అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవి సీనియర్ కే ఇవ్వాలని అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ పదవి కి ఎవరు సీనియర్ అనేది తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడి జనసైనికులు.ఈ క్రమంలో ఈ పదవి పంచాయతీ పవన్ వరకు చేరింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మంచి రసవత్తరంగా మారింది. ఇంతకీ ఈ పదవికి ఎవరు అర్హులు? ఆ సీనియర్ నేత ఎవరు? అధిష్టానం అనౌన్స్ చేయబోయే పేరేది..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

పచ్చిని కోనసీమ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది అమలాపురం. అలాంటి పచ్చని సీమలోని జనసేన లో బీటలు ఏర్పడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో అమలాపురానికి ఓ ప్రత్యేక స్థానం వున్నా అక్కడ జనసేన పార్టీ మాత్రం రాను రాను పీకలల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నియామకంపై ఊగిసలాట మళ్ళీ మొదటికి వచ్చింది. వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేసులో…. జనసేన సీనియర్ నాయకులు ఆర్.డి.ఎస్. ప్రసాద్, సూదా చిన్నా, కంచిపల్లి అబ్బులు పేర్లు సూచిస్తూ అమలాపురం పార్టీ కేడర్ నిర్ణయం తీసుకుని జనసేన అధిష్టానానికి మూడు నెలల క్రితం పంపింది. ఆదివారం సోషల్ మీడియా లో కంచిపల్లి అబ్బులు పేరు ఖరారు అయినట్లు విస్తృత ప్రచారం సాగింది. దీంతో ఒక్క సారిగా సీనియర్ నేతలు భగ్గుమన్నారు.

పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్న నేతలను కాదని 2019 ఎన్నికల్లో వచ్చిన నేతకు ఈ చైర్మన్ పదవి ఇవ్వడం సరికాదంటూ సోషల్ మీడియా లో హోరెత్తిస్తున్నారు. ఈ విషయం కాస్త జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ వరకు చేరింది. దాంతో సీనియర్ పేరు ను ప్రపోజల్ చేయమని స్థానిక నేతల కు ఆయన చెప్పినట్లు సమాచారం. జనసేనకి కేటాయించిన ఈ పదవి పట్ల కూటమి టీడీపీ నేతలు జోక్యం ఎక్కువైందన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. అప్పటికే అబ్బులు పేరు ప్రచారం సాగడంతో రెండవ పేరు కు ఎమ్మెల్యే అడ్డు పెడుతున్నట్లు సమాచారం. దాంతో కొంతమంది జనసేన నేతలు మంగళగిరి పార్టీ ఆఫీస్ కు క్యూ కడుతున్నట్లు సమాచారం.

దేవస్థానం చైర్మన్ పదవి ఆశించిన జనసేన సీనియర్ నాయకుల పేర్లు పట్ల అమలాపురం టీడీపీలోని గ్రూప్ కి ఇష్టం లేక పోవడంతో అబ్బులు పేరు ప్రచారం చేస్తునట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన సీనియర్ నేతల్లో ఒక్కరికి చైర్మన్ ఇవ్వాలి అంటూ ఆ పేరును వారిద్దరూ అధిష్టానం దృష్టిలో పెట్టడంతో చైర్మన్ నియామకం వ్యవహారం రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ లో సీనియర్లు గా ఉన్న ర్యాలీ ప్రసాద్, సూదా చిన్నా ఇద్దరూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ పావులు కడుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం సుముఖం ఉన్నట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరొకరు పేరు ప్రతిపదించాలని చూస్తున్నారని తెలుస్తోంది.