కారుమూరి భాష తీరుతో వైసీపీ క్యాడర్‌‌కు ఇబ్బందులు..!

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీరు ఏమాత్రం మారలేదట. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన్ని బూతుల మంత్రిగా జిల్లా ప్రజలు చెప్పుకునే వారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత అయినా, పద్దతి మార్చుకుంటారని వైసీపీ కేడర్ తో సహా అందరూ భావించారు. కానీ ఇప్పటికీ ఆయన పద్దతి, భాష మారకపోవడంతో పార్టీ కేడర్ ఇబ్బంది పడుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బూతులు మంత్రిగా పేరు గడించారు కారుమూరి నాగేశ్వరరావు. టిడిపి కంచుకోటగా ఉన్న తణుకు నియోజకవర్గంలో 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో విజయం సాధించారు కారుమూరి. వైసిపి అధ్యక్షుడు జగన్ మెచ్చి మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రిగా ఉన్న కారుమూరి ప్రజా సమస్యలను పక్కనపెట్టి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూడా అప్పట్లో టాక్ నడిచింది. తణుకు మునిసిపాలిటీలో 21 ఎకరాలు పార్కుల అభివృద్ధి, డంపింగ్ యార్డ్ కోసం సేకరించి భూమిని గజామణిలోకి మార్చి టిడిఆర్ బ్యాండ్ల మంజూరు చేశారు. ఇక్కడే అసలు స్కాం జరిగింది. 7 వేల రూపాయలు ఉన్న గజం స్థలాన్ని 21 వేలుగా చూపించి దానికి నాలుగు రెట్లు విలువ చేసి బాండ్లు జారీ చేశారు. ఇలా తణుకులో సుమారు 900 కోట్ల విలువైన టిడిఆర్ బాండ్లు కుంభకోణానికి పాల్పడినట్లు సాక్షాత్తు సిబిసిఐడి ఎంక్వయిరీ లో తేలింది.

ఇక మంత్రిగా ఉన్న కారుమూరి అన్నదాతలను విమర్శించిన తీరు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. వైసిపి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. తుఫాన్లు, అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రోడ్డెక్కి అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో రైతన్నల దగ్గరికి వెళ్ళిన కారుమూరి నాగేశ్వరరావు రైతులు అనే గౌరవం లేకుండా ఎర్రి పప్ప అంటూ సంబోధించారు. దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అయినా ఆయన తీరు మారలేదు. ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా అంటూ ఆయన వివరణ ఇవ్వడంపై కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వచ్చాయి. అంతేకాదు, మంత్రిగా ఉన్న సమయంలో సమస్యలు పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చాయి.

ఇక 2024 ఎన్నికల్లో తణుకు నుంచి పోటీచేసి ఓడిపోయారు కారుమూరి. ఘోర పరాజయం తర్వాత నియోజకవర్గంలో తన ఉనికిని కాపాడుకునేందుకు అనేక స్టంట్ లు చేస్తున్నారు. ఇదే సమయంలో లోకేష్ రెడ్ బుక్ లో తన పేరు ఉందేమన్న భయం కూడా ఆయన్ని వెంటాడుతోందట. మరోవైపు నియోకవర్గంలో పార్టీ మీద పట్టు చేజారకుండా ఉండేందుకు ఆత్మీయ సమ్మేళనాలతో హడావుడి చేస్తున్నారు కారుమూరి. ఏలూరులో జరిగిన ఈ సమావేశంలో కూడా ఆయన నోరు పారేసుకున్నారు. గుంటూరు అవతల ఉన్న వారిని నరికేస్తామన్న ఆయన గుంటూరు ఇవతల ఉన్న వారిని ఇంటిలోంచి బయటకు లాగి కొడతామని కామెంట్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అసలే పార్టీ పరిస్తితి బాగాలేని సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని వైసీపీ కేడర్ టెన్షన్ పడుతోందట.