నెల్లూరులో వైసీపీకి దిక్కెవరు…?

ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి నాయకత్వం వహించడానికి నాయకులు పోటీపడేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదా? అధికారానికి దూరం కావటంతో పార్టీ పగ్గాలు మోయటానికి ఎవరు మక్కువ చూపించడం లేదా? అక్కడి పార్టీ అధ్యక్షుడిని సైతం వివిధ రకాల కేసులతో పోలీసులు రిమాండ్ పంపడంతో…ఆ జిల్లా బాధ్యతలను పార్టీని మోసే నాయకుడే కరువయ్యారా? ఇంతకీ అది ఏ జిల్లా? ఏ పార్టీకి ఇంతటి కష్టం వచ్చింది..లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకి నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి క్యూ కట్టారు. అయితే మారిన పరిణామాల వల్ల అధికారానికి వైసీపీ దూరం కావడంతో పార్టీ పగ్గాలు మోయడానికి అందరూ వెనకడుగు వేస్తున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు పార్టీ పగ్గాలు మోస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ తోపాటు వివిధ రకాల కేసులలో నిందితుడిగా చేర్చి రిమాండ్ పంపిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ఎంతో బలంగా ఉన్న పార్టీనీ మోసే లీడర్ ఎవరంటూ తెగ చర్చ జరుగుతుంది.

గతంలో కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పజెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కి బాధ్యతలు అప్పజెప్పి జిల్లా మొత్తం చూసుకోమని ఆయనపై పెద్ద భారమే పెట్టారు. అధినేత జగన్ మాట కాదనలేక చిరునవ్వుతో పార్టీని నడిపించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ పగ్గాలను అధిష్టానం కాకాని గోవర్ధన్ రెడ్డికి అప్పజెప్పింది. జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటే అన్యాయంగా ఆయనకి ఆ పదవిని తప్పించి కాకానికి అంటగట్టారు . దీంతో జిల్లాలోని వైసిపి కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కష్టపడే మనస్తత్వం కలిగి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు ఎందుకు తప్పించారని జిల్లా ముఖ్య నాయకులు వైఎస్ జగన్ ను సూటిగానే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ అవసరం అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకు లా చంద్రశేఖర్ రెడ్డిని పక్కనపెట్టి కాకానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. ఇక కాకానిని అక్రమ మైనింగ్ కేసుతో పాటు వివిధ రకాల కేసులు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన పోలీసుల రిమాండ్ లో ఉన్నారు. దీంతో జిల్లాలో మళ్లీ పార్టీని మోసే నాయకుడు ఎవరనే టాక్ నడుస్తోంది.

కాకాని గోవర్ధన్ రెడ్డి పై దాదాపు పది కేసులు ఉండటంతో బహుశా ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వల్లభనేని వంశీని ఏ విధంగా కేసుల మీద కేసులతో జైలుకు పంపుతున్నారో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అదే విధంగా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీని నడిపించేవారు లేక వెలవెలబోతోంది. ఇక జిల్లాలో పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్న అధినేత జగన్మోహన్ రెడ్డికి గుర్తుచ్చే ఒకే ఒక్క పేరు పర్వతరెడ్డి చంద్రశేఖ ర్ రెడ్డి . ఇప్పుడు కూడా ఆయన సేవలు ఉపయోగించుకోవడానికి సర్వసిద్ధం అయినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే పర్వత రెడ్డి అధిష్టానానికి గుర్తొస్తాడా ? మిగతా సమయంలో గుర్తుకు రాడా ? అని జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఇలా అధ్యక్షులను మార్చుకుంటూ పోతుంటే వైసీపీకి జిల్లాలో కేడర్ దూరమవుతుందనే ప్రచారము జరుగుతుంది.

గత ఎన్నికల్లో కూడా సిటీ ఇన్చార్జిగా.. ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఖలీల్ ను నియమించింది.ఖలీల్ ఓటమి అనంతరం మళ్లీ చంద్రశేఖర్ రెడ్డిని సిటీ ఇన్చార్జిగా నియమించింది. ప్రస్తుతం నెల్లూరు సిటీలో అల్లకల్లోలంగా ఉన్న వైసీపీని పర్వత రెడ్డి ఒక తాటిపైకి తేవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది నాయకులు టీడీపీలోకి వెళ్తుండగా ఆయన మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. మరి అలాంటి వ్యక్తికి వైసిపి అధిష్టానం మాత్రం సరైన గుర్తింపు ఇప్పటికీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది.పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని వాడుకోవటం అవసరం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయటం ఏంటని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారట.

ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి మళ్లీ చంద్రశేఖర్ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పజెప్పి కాకాని బెయిల్ పై బయటకు వస్తే మళ్లీ కాకానికి జిల్లా అధ్యక్ష పదవి అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే జిల్లా అధ్యక్షుడిగా నూటికి నూరు శాతం సరిపోతారని అయితే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు తప్పించి వేరే వాళ్ళకి ఇస్తే పార్టీ పూర్తిగా మునిగిపోతుందని జిల్లాలో టాక్. మరో వారం రోజుల్లో వైసీపీ అధిష్టానం నెల్లూరు జిల్లాకి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరును అధికారకంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పర్వత రెడ్డి కంటిన్యూ గా అధ్యక్షడిగా కొనసాగుతాడా ?.. కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పై బయటకు వస్తే రాజీనామా చేస్తాడా ? అనేది వేచి చూడాలి మరి.