తెలుగుదేశం పార్టీ స్థాపనకర్త.. ఎన్టీఆర్!

ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం అంటూ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన..
తొమ్మిది నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని..
తెలుగుదేశం పార్టీ స్థాపనకు ఆద్యులై, సంక్షేమానికి కేరాఫ్ గా నిలిచిన ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రస్థానం, విశేషాలను ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేకంగా తెలుసుకుందాం:

1982 మార్చి 21న హైదరాబాదును సందర్శించినప్పుడు ఆయన అభిమానులు ఎర్రతివాచీ పరిచి మరీ స్వాగతం పలికారు. సరిగ్గా వారం రోజులకు మార్చి 29న కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరును ‘తెలుగుదేశం’గా నిర్ణయించి, ప్రకటించారు కూడా. ఇక పార్టీ ప్రచారం కోసం తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానినే ప్రచారవేదికగా మలిచారు. దీనికి ‘చైతన్యరథం’ అని పేరు పెట్టడం విశేషం. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే సున్నితమైన అంశాన్ని ముందుకు తీసుకువెళ్తూ.. ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారు. అదే ఆయనను అతి తక్కువ కాలంలో పాలన పగ్గాలను చేపట్టేలా చేసింది.

1983 జనవరి 7న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో.. తెలుగుదేశం- 199, కాంగ్రెసు- 60, సిపిఐ- 4, సిపిఎం- 5, బిజెపి- 3 సీట్లు గెలుచుకున్నాయి. ఆనాటివరకు 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీని సైతం 9 నెలల వ్యవధి ఉన్న తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడించింది. ఆంధ్రప్రదేశ్ మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తక్షణం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ఇవి అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి.

  • పేదలకు కనీస ప్రాథమిక అవసరాలు తీర్చేందుకనీ, 1994లో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం అప్పట్లో సంచలనం సృష్టించింది.
  • సారా వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిస్తూ మద్యపాన నిషేధాన్ని అమలుచేశారు.
  • అప్పట్లో ఉన్న పట్వారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు.
  • మండలాలను ఏర్పాటు చేయడమే కాక.. మండల, జిల్లా స్థాయి పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా.. ఆయా స్థాయిల్లో అధ్యక్షులుగా అవకాశం కల్పించిన వారయ్యారు.
  • ప్రతి మండల కేంద్రంలోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, వాణిజ్య బ్యాంకు, ప్రాథమిక సహకార పరపతి సంఘం, పోలీస్‌స్టేషన్‌, జూనియర్‌ కళాశాల, సబ్‌ ట్రెజరీ వంటి తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా రూపకల్పన చేశారు.
  • చిన్న, సన్నకారు రైతులకు భూమి శిస్తు రద్దు చేశారు.
  • మద్దతు ధర దక్కని చెరకు, వరి రైతులకు బోనస్‌ అందించే విధానాన్ని తొలుత ఎన్టీఆరే మొదలుపెట్టారు.
  • తెలుగు గ్రామీణ క్రాంతి పథం ద్వారా బోర్లు, బావులు, చెరువుల్ని అనేకం తవ్వించారు. వాగులు, వంకల ద్వారా వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే వందలాది ఎత్తిపోతల పథకాల్ని సైతం ప్రవేశపెట్టారు.
  • గిరిజనుల సంక్షేమం కోసం.. గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నీటి వనరులకు నిధుల కేటాయింపు, గిరిజన పాఠశాలల ఏర్పాటు.. కిలో రూ.1.25కే జొన్నల పంపిణీ, వారి నివాసం కోసం పది వేల ఇళ్ల నిర్మాణం, ప్రతి గిరిజనుడికి అందుబాటులో ఉండేలా వైద్య సౌకర్యం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
  • రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 15 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 4 నుంచి 6 శాతానికి పెంచారు.
  • కాంగ్రెస్‌ హయాంలో పేదలకు ఇళ్ల పథకం ఉన్నా.. అవి తూతూమంత్రంగా ఉండేవి. ఎన్టీఆర్‌ మాత్రం పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
  • పేదలకు తక్కువ ధరకే దుస్తులు అందించేందుకు.. సగం ధరకే చీర, ధోవతి అనే పథకాన్ని తీసుకొచ్చారు. చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాల వంటి వాటిని రాయితీపై ఇవ్వడంతోపాటు.. వారు నేసిన వస్త్రాలను నేరుగా ప్రభుత్వం సేకరించేలా చర్యలు తీసుకున్నారు.
  • ఇంజినీరింగ్‌, వైద్య విద్యనభ్యసించే కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ విధానాన్ని తీసుకువచ్చారు.
  • వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్‌ ఫీజును రద్దు చేశారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలను నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేశారు. విద్యార్థులకు వసతిగృహాలను సైతం నిర్మించారు. *దేశంలోనే తొలిసారిగా మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత మాత్రం ఆయనదే!
  • ‘నా తెలుగింటి ఆడపడుచులు’ అంటూ ఆప్యాయంగా పిలిచే ఎన్టీఆర్‌.. పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. తండ్రి ఆస్తిలో కుమార్తెకు సైతం సమాన హక్కు కల్పించారు. అంతేకాక ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థినులకు ప్రత్యేకించి 33% రిజర్వేషన్‌ కల్పించడం. మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, జిల్లా ప్రజాపరిషత్తు ఛైర్మన్‌ పదవుల్లో.. 9శాతాన్ని మహిళలకే కేటాయించడం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బడుగు బలహీన మహిళలకు తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాల ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఆపై ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.
  • మహిళల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక శాఖను సైతం ఏర్పాటు చేయడం విశేషం.
  • 1996 జనవరి 18న, ఆయన తన 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.