ఎస్పీ బాలు జయంతి నేడు..!

సంగీతప్రియులకు ఆయన స్వరమే వరం.. పాటే మంత్రం..కాలాలు మారినా, తరాలు మారినా..
ప్రతీ మదినిండా ఆయన ఆలపించిన వేలకొద్దీ పాటలు.. లక్షల కొద్దీ అభిమానులను సంపాదించి పెట్టింది.
పాడుతా తీయగా…చల్లగా అంటూ శ్రోతల మదిలో
‘బాలు’గా స్థిరపడిపోయిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారి 79వ జయంతి నేడు.. (జూన్ 4న) ఈ సందర్భంగా ఆయన గురుంచి విశేషాలు తెలుసుకుందాం..

1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో ఎస్పీ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శంకుతలమ్మ దంపతులకు బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. నాన్న హరికథాగానం చేసేవారు. చిన్ననాటినుంచే పక్కింటి రేడియోలో వచ్చే పాటల్ని వింటూ స్వీయసాధన చేస్తుండేవారు. సినిమా పాటలను బాగా పాడేవారు. ఎస్ఎస్ఎల్ సి శ్రీకాళహస్తిలో పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో పీయూసీ కాలేజీలో చేరారు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగ్ సీట్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడి ఆర్కెస్ట్రా బృందంతో కలిసి అప్పుడప్పుడు నాటకాలు వేశారు. కాని అక్కడి వాతావరణం ఆయనకు నచ్చక తిరిగి ఇంటికొచ్చేశారు. మద్రాస్ వెళ్లి ఎఐఎం చదువుతానన్నారు. అక్కడ్నుంచే సినిమాల్లో గాయకుడిగా ప్రయత్నాలు చేశారు.

ఓసారి ‘సోషల్ కల్చర్డ్ క్లబ్’ వాళ్ళు పెద్దస్థాయిలో పాటల పోటీ నిర్వహించారు. బాలుగారి స్నేహితుడైన మురళిగారు ఈ పోటీలో పాల్గొనమని సలహా ఇవ్వడంతో.. అప్పటికప్పుడు బాలుగారు స్వయంగా పాట రాసుకొని పాడి, మొదటి బహుమతి పొందారు. ఆ తర్వాత నుంచి సినీప్రయత్నాలు గట్టిగానే చేశారు.

తొలి అవకాశం..
ఎస్పి కొందండరాంగారు మొదటగా ఒక అవకాశం ఇచ్చారు. అది 1966లో ‘శ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు పాటలు పాడారు.
ఎంఎస్ విశ్వనాథన్ గారు బాలుగారితో పాట పాడించుకొని, బాగుంది. తమిళంలో పాట పాడగలవా? తమిళం నేర్చుకొని వస్తే అవకాశమిస్తానన్నారట. అలా డబ్బింగ్ చిత్రాలకు పాడే అవకాశం వచ్చింది.

1969లో ఘంటసాల తో ‘ఆలు మగలు’ సినిమాకు ఒక పాటను కలిసి పాడారు.
అది మొదలు.. ఏఎన్నార్, ఎన్టీరామారావు, శోభన్ బాబు, కృష్ణలాంటి సీనియర్ హీరోలేకాక ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతోపాటు తర్వాత వచ్చిన యువహీరోల వరకూ దాదాపు అందరి హీరోలకు ఆయన పాటలు పాడారు. ఆయన గొంతు అంతచక్కగా సరిపోయేది మరీ!
ఆయన కొన్నాళ్లపాటు కమలహాసన్ రజనీకాంత్ లకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు. హీరోలకే కాదు కమెడియన్లకి పాడిన ఘనత ఆయనది. పలు రకాల గొంతుల్ని అచ్చు అలానే దింపేయగల ప్రతిభావంతులు!

  • 1976లో వచ్చిన ‘మన్మథలీల’ సినిమాకుగానూ తొలుత కమలహాసన్‌కు గొంతు అరువిచ్చారు బాలు. ఆ తర్వాత కమలహాసన్‌కు బాలుగారు పర్మనెంట్ డబ్బింగ్‌ ఆర్టిస్టయ్యారు. ‘దశావతారం’ సినిమాలో కమల్‌ పది పాత్రలకు పది రకాలుగా డబ్బింగ్ చెప్పారు.
  • డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాక కొన్ని పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ గానూ, సినిమాల్లో ఆర్టిస్ట్ గానూ, నిర్మాతగానూ వ్యవహారించారు.
  • తెలుగులోనే కాదు, బాలీవుడ్ లోనూ 700లకు పైగా హిందీ పాటలు పాడారు. ఇవేకాక ప్రైవేటుగా భక్తి గీతాలతో కలిపి 16 భాషల్లో మొత్తంగా 37వేలకు పైగా పాటలు ఆలపించి చరిత్ర సృష్టించారు.
  • బాలుగారు భార్య సావిత్రి. ఇద్దరు పిల్లలు ఎస్పీ పల్లవి, ఎస్పీ చరణ్. కొడుకు చరణ్ గాయకుడు. కూతురు ఎస్పీ శైలజ. నేపథ్య గాయని, ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను పెళ్లి చేసుకున్నారు. *అంతకన్నా ముందే వచ్చిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో బాలుగారు న్యాయనిర్ణేతగా వ్యవహారించారు. ఈ వేదిక ద్వారా ఎంతోమంది గాయనీగాయకులకు మంచి ప్రోత్సాహామందించారు.

గుర్తింపు..

  • భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషన్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.
  • 6 జాతీయ అవార్డులు, 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు లభించాయి.
  • ఉత్తమ గాయకుడిగా, పలు విభాగాలకు కలిపి 26 నంది అవార్డులు వచ్చాయి.
  • 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది.
  • 2016లో శతవసంత భారత చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం వచ్చింది.

యాభై వసంతాల్లో 16 భాషల్లో 37వేల పాటల్ని ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించిన వన్ అండ్ ఓన్లీ సింగర్.. శ్వాసకోశ సమస్యలు ఎక్కువై, ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబర్ 20న చెన్నైలోని ఎంజేఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.