
బంగారు, వెండి వస్తువుల తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీలాండరింగ్ చేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా బ్యాంకులు తనిఖీ చేయాలని రిజర్వుబ్యాంకు తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఫలానా బంగారం, వెండి వస్తువులు ఆ వ్యక్తి సొంతదేనా, కాదా అనేది తెలుసుకోడానికి వారి నుంచి రిసిప్ట్స్ ను పరిశీలించాలి. అవి లేకపోతే అది సొంతదే అని రాతపూర్వక పత్రాలను తీసుకోవాలి. బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలిచ్చేస్తామని మోసపూరిత ప్రకటనలను ఏవీ జారీ చేయవద్దని అన్ని బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ స్పష్టం చేసింది. బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో, రుణాల మంజూరు విషయంలో పలు సంస్థలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
అవి..
- ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి ఆభరణాలకు మించి బ్యాంకు/ ఆర్థిక సంస్థలు తాకట్టు పెట్టుకోకూడదు.
- ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణ మొత్తం ఆధారంగా నిర్ణయిస్తాం.
- ఉదాహరణకు, రూ.2.50 లక్షలలోపు రుణం అడిగితే… తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో 85 శాతం వరకూ ఇస్తారు అంటే ఆభరణం విలువ సుమారుకు సరిపోతుంది.
- అదే రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు అడిగితే 80శాతం, రూ.5 లక్షలకు మించి రుణం అడిగితే ఆభరణాల విలువలో 75 శాతం మాత్రమే బ్యాంకు లేదా ఇతర ఆర్ధిక సంస్థలు రుణాలివ్వాలి.
- బంగారం నాణేలు, బిస్కెట్లు అయితే 50 గ్రాములకు.. వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టుకు స్వీకరించకూడదు.
- బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేసి విచారించాలి.
- అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి.
- రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. చెల్లించకపోతే తాకట్టు సొత్తును వేలం వేయాలి. వేలం ప్రక్రియను మొదట.. బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో నిర్వహించాలి.
అప్పుడు పూర్తికాకపోతే రెండోసారి.. ఆన్లైన్ విధానంలో లేదా పక్క జిల్లాలోనైనా నిర్వహించవచ్చు.
- రుణ బకాయి చెల్లించిన రెండేళ్లలోపు సొత్తును తిరిగి తీసుకెళ్లకపోతే బ్యాంకు పాలకమండలికి వివరించాలి. వారు రుణగ్రహీతలు, వారి వారసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారం పంపుతారు.
ఇకపై ఇంటి అవసరాలకు, చదువు, పెళ్లి కోసమంటూ తాకట్టు పెట్టే విషయంలో పై నిబంధనలను దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మేలు!