అక్కినేని హీరో ప్రయత్నం ఈసారైనా ఫలించేనా..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం కథానాయకుల్లో ఒకడు సుశాంత్. హీరోగా మెప్పించాలి.. వరుసగా సినిమాలు చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అలాగని సుశాంత్ ప్రయత్నం చేయడం లేదా అంటే.. చేస్తున్నాడు. కానీ.. వర్కవుట్ అవ్వడం లేదు అంతే. ఆమధ్య వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాలు ఏవీ కూడా అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ సోలో హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రిస్కే చేస్తున్నాడు. ఇంతకీ.. సుశాంత్ చేస్తోన్న రిస్క్ ఏంటి..? ఈసారైనా ప్రయత్నం ఫలించేనా..?

కాళిదాసు సినిమాతో అక్కినేని మనవడుగా, నాగార్జున మేనల్లుడుగా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ తొలి సినిమాతోనే మంచి నటుడు అనిపించుకున్నాడు. ముఖ్యంగా డ్యాన్స్ బాగా చేస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు. ఆతర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా, చిలసౌ చిత్రాల్లో నటించాడు. ఇందులో చిలసౌ సినిమా సక్సెస్ తో పాటు మంచి పేరు తీసుకువచ్చింది. ఆతర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాతో మరింత మంది ఆడియన్స్ కు చేరువయ్యాడు సుశాంత్.

అల.. వైకుంఠపురములో తర్వాత ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటూ సోలో హీరోగా మరో సినిమా చేశాడు. ఈ సినిమా సుశాంత్ కి కలిసి రాలేదు కానీ.. ఈ మూవీతో పరిచయమైన మీనాక్షి చౌదరికి మాత్రం బాగా హెల్ప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మీనాక్షి వరుస ఆఫర్స్ తో కెరీర్ లో దూసుకెళ్లింది. సుశాంత్ మాత్రం రవితేజ రావణాసుర, చిరంజీవి భోళా శంకర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఈ సినిమాలు సుశాంత్ కు ఏ రకంగానే హెల్ప్ అవ్వలేదు. మధ్యలో మా నీళ్ల ట్యాంక్ అంటూ ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఇలా తనకు వచ్చిన అవకాశాలను సదిన్వియోగం చేసుకునే ప్రయత్నం అయతే చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు కెరీర్ లో 10వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పృధ్విరాజ్ చిట్టేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సంజీవని క్రియేషన్స్ బ్యానర్ లో వరుణ్ కుమార్, రాజ్ కుమార్ కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీని తన మార్కెట్ లెక్కలు వేసుకోకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. సక్సెస్ కావాల్సిన ఈ టైమ్ లో భారీ సినిమా అంటే రిస్కే. అయినప్పటికీ.. సుశాంత్ ఈసారి గట్టిగా కొట్టాలని తపిస్తున్నాడు. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. సుశాంత్ చేస్తోన్న ఈ రిస్కీ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.