రీ రిలీజ్ లో సరికొత్త ప్రయోగం.. లక్ష్మీ నరసింహా.!

పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది రీ రిలీజ్.. అదే నయా ట్రెండ్. ఒకప్పుడు ఒకసారి సినిమా రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ రిలీజ్ అంటూ మళ్లీ ఆ సినిమాను కొన్ని రోజులు తర్వాత విడుదల చేసేవారు. రాను రాను సెకండ్ రిలీజ్ అనేది పోయింది. ఇప్పుడు రీ రిలీజ్ అంటూ పాత సినిమాలను థియేటర్స్ లో చూడని వాళ్లు చూసే అవకాశం లభించింది. అయితే.. రీ రిలీజ్ అంటూ ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయడంతో ఈ ట్రెండ్ ఇక ముగిసింది అనే స్టేజ్ కు వచ్చింది. అయితే.. ఇప్పుడు రీ రిలీజ్ లో బాలయ్య లక్ష్మీ నరసింహా ఓ సరికొత్త ప్రయోగం చేస్తుండడం విశేషం. ఇంతకీ.. లక్ష్మీ నరసింహా చేస్తోన్న ప్రయోగం ఏంటి..? ఈ ప్రయోగం ఓ ట్రెండ్ అయ్యేనా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటించిన పోకిరి సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువుగా రెస్పాన్స్ రావడంతో అప్పటి నుంచి రీ రిలీజ్ అనేది ట్రెండ్ గా మారింది. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్ లతో పాటు సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నట సింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తదితర హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను రీ రిలీజ్ చేశారు. వీటికి అనూహ్యమైన స్పందన వచ్చింది.

అయితే.. రీ రిలీజ్ ల పేరుతో పాత ప్లాప్ సినిమాలు కూడా విడుదల చేస్తుండడంతో దీని పై క్రేజ్ తగ్గింది. ఇప్పుడు స్టార్ హీరోల పాత సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పటికీ ఆశించిన స్తాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఇక ఈ ట్రెండ్ అయిపోయింది అనుకుంటుంటే.. ఖలేజా సినిమా రీ రిలీజ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాలు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ దాటి వావ్ అనిపించేలా ఖలేజా సినిమా వసూలు సాధించింది. ఇదిలా ఉంటే.. బాలయ్య లక్ష్మీ నరసింహా మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి జయంత్ సి పర్జానీ డైరెక్టర్ అయితే.. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమాను నిజంగానే కొత్తగా విడుదల చేస్తున్నారు.

అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం కొత్త ప్రయోగం చేస్తున్నారు. అది ఏంటంటే.. ఈ మూవీలో ఓ పాటని కలుపుతున్నారు. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఈ సినిమా కోసం అప్పట్లో ఓ పాటను షూట్ చేసి ఎడిట్ లో తీసేసారు. ఆ పాటని ఇప్పుడు కలపాలని బెల్లంకొండ ఫిక్స్ అయ్యారు. అయితే.. పాట ఉంది. సౌండ్ లేదు. దాంతో ఆ విజువ‌ల్స్ కు స‌రిప‌డా మ్యూజిక్ భీమ్స్ తో చేయించారు. దీనికి చంద్రబోస్ పాట రాసారు. ఓ రకంగా ఇదొక ప్రయోగం అని చెప్పచ్చు. ఆ విజువ‌ల్స్ కి త‌గ్గ‌ట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేసి, పాట రెడీ చేయ‌డం మామూలు విష‌యం కాదు. ఇది నిజంగా సరికొత్త ప్రయోగమే. ఇలా పాత సినిమాల్లో కొత్త పాటను యాడ్ చేస్తే.. రీ రిలీజ్ సినిమాలకు ఊపు వస్తుంది. మరి.. ఇది ట్రెండ్ గా మారుతుందేమో చూడాలి.