యష్ vs రణ్‌బీర్.. రామాయణంలో భారీ యాక్షన్ స్టార్ట్

రామాయణం పేరుతో బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాణంలో నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం రెండు భాగాలుగా రానుంది. ప్రముఖ నటుడు, నిర్మాత ‘రాకింగ్‌ స్టార్‌ యశ్’ ఈ భారీ ప్రాజెక్టులో రావణుడి పాత్రలో కనిపించబోతుండగా, హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌తో కలిసి యాక్షన్ సన్నివేశాలపై పని చేస్తున్నారు. గై నోరిస్‌ గతంలో ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఇప్పుడు ఆయన ‘రామాయణం’ కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం భారతీయ పౌరాణిక గాథను ప్రపంచస్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.

యష్ ఈ సినిమాలో నటుడిగా మాత్రమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ మొదలైనప్పటి నుంచే యష్ సృజనాత్మకంగా పూర్తిగా చొరవ చూపుతూ ప్రతి అంశంలో భాగస్వామిగా మారారు. ఈ నేపథ్యంలో తను పోషిస్తున్న రావణ బ్రహ్మ పాత్రను మరింత శక్తివంతంగా, కొత్త కోణంలో చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సెట్స్ నుంచి తాజాగా విడుదలైన ఫోటోల్లో యశ్ ఒక శక్తివంతమైన, యుద్ధ సిద్ధంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆయన శారీరక రూపాంతరం రావణుని పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్), యశ్ (మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్) కలిసి నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్ కూడా ఇందులో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘రామాయణం – పార్ట్ 1’ దీపావళి 2026లో విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ సినిమాకు ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. సినిమా ఫ్యాన్స్‌కు ఇది ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా మారనుంది!