నాగ్ తర్వాత మణిరత్నంతో చేస్తోన్న తెలుగు హీరో..?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం ఇప్పటి వరకు ఎన్నో అద్బుతమైన చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. అయితే.. మణిరత్నం డైరెక్షన్ లో నటించిన ఒకే ఒక్క తెలుగు హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున. అదే.. గీతాంజలి సినిమా. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన గీతాంజలి అప్పట్లో సంచలనం. ఈ లవ్ స్టోరీ టైమ్ లెస్ క్లాసిక్ గా నిలిచింది. అయితే.. నాగార్జునతో గీతాంజలి తర్వాత మణిరత్నం ఇంత వరకు తెలుగులో సినిమా చేయలేదు. ఇప్పుడు మణిరత్నం తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మణిరత్నం డైరెక్షన్ లో నటించే తెలుగు హీరో ఎవరు..? ఈ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు..?

మణిరత్నం ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ తో మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కానుంది. ఇందులో కమల్, శింబు నువ్వా..? నేనా..? అనేట్టుగా పోటీపడేలా నటించారని టాక్ వినిపిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓ విభిన్న ప్రేమకథా చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే.. ఈ మూవీని తెలుగు హీరోతో చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త లీకైంది.

అదే కనుక జరిగితే.. నాగార్జున తర్వాత మణిరత్నం తెలుగు హీరోతో చేస్తున్న సినిమా అవుతుంది. ఇంతకీ.. ఈ లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకోబోతున్నారు అంటే.. నవీన్ పొలిశెట్టి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి స్టోరీ లాక్ అయ్యిందని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందట. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మణిరత్నం భావోద్వేగాలను తెర పై బాగా పండిస్తారు. అదే ప్రేమకథలో అయితే.. ఇంకా బాగా పండిస్తారు. మరి.. మణిరత్నం ఈసారి ఎలాంటి ప్రేమకథను తెరకెక్కిస్తారో చూడాలి.