
రెండు తెలుగు ప్రభుత్వాలు.. సినిమా ఇండస్ట్రీ అవార్డులు గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. 2024 సంవత్సరానికి గాను అవార్డులును ప్రకటించింది. ఇందులో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు పుష్ప 2 సినిమాకు గాను అవార్డ్ ప్రకటించడం అనేది ఆసక్తిగా మారింది. బన్నీకి అవార్డ్ ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఇంతకీ.. ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు అయ్యింది. అసలు ఏం జరిగింది..?
పుష్ప 2 ప్రీమియర్ షో టైమ్ లో సంధ్య థియేటర్ దుర్ఘటన ఎంతలా బన్నీని వెంటాడిందో తెలిసిందే. ఆ సంఘటననే బన్నీ అభిమానులే కాదు.. తెలుగు జనాలు ఎవరూ మరచిపోలేరు. బన్నీ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. ఆతర్వాత కోర్టుకు హాజరవ్వడం.. ఆతర్వాత జైలుకు వెళ్లడం.. బైలు రావడం తెలిసిందే. అయితే.. ఆ టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. కావాలనే ఇదంతా చేస్తున్నారే మాటలు సామాన్య జనాల్లో కూడా వినిపించాయి. సినిమా హీరో అయితే ఏంటి అనేట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆతర్వాత సినీ పెద్దలు వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడం.. ఆ సమస్యకు పరిష్కారం అవ్వడం తెలిసిందే.
గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పురస్కారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా కోపం లేదనే విషయాన్ని చెప్పినట్టు అయ్యింది. నిజంగా బన్నీ పై కోపం ఉంటే.. ఉత్తమ నటుడుగా అవార్డ్ ను లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, పొట్టేల్ సినిమాల్లో నటించిన హీరోలకు ఇచ్చుండచ్చు కానీ.. అలా చేయలేదు. పుష్ప 2 పర్ ఫార్మెన్స్ ముందు అవన్నీ తక్కువే. అందుకే వ్యక్తిగతంగా ఎలాంటి అజెండాలు పెట్టుకోకుండా ఎవరికీ అర్హత ఉంటే వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే నిజాయితీగా ఈ అవార్డ్స్ ను ఎంపిక ప్రక్రియ చేశారని చెప్పచ్చు.
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్ లభించింది. అలాంటప్పుడు పుష్ప 2 సినిమాలో నటనకు గద్దర్ అవార్డ్ ఇవ్వడంలో ఎలాంటి ఆశ్యర్యం లేదు. ఈ సినిమాలో జాతర సాంగ్ లో బన్నీ పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బన్నీ నటనను అభినందించారు. జూన్ 14న జరిగే వేడుకలో స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ కు అవార్డ్ అందివ్వబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. ఒకే వేదిక పై ఉండడం.. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ తీసుకోవడం ఎప్పటికీ మరచిపోలని జ్ఞాపంగా నిలుస్తుంది. ఏది ఏమైనా గద్దర్ అవార్డ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు అయ్యింది.