
కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనుష్క. లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే.. అనుష్కనే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకుంది. అయితే.. ఈ అమ్మడుకు భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటుంది. ఈమధ్య మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాతో సక్సెస్ సాధించిన అనుష్క ఇప్పుడు ఘాటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ స్టార్ హీరో క్రేజీ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ స్టార్ హీరో ఎవరు..? ఈ క్రేజీ మూవీ ఏంటి..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన స్టైలీష్ ఫిల్మ్ సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బెంగుళూరు భామ అనుష్క. తొలి సినిమాతోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత స్టాలిన్ సినిమాలో చిరుతో కలిసి ఓ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్రకారు మనసులు దోచుకుంది. ఇక ఈ అమ్మడు కెరీర్ లో మరచిపోలేనిది.. మలుపుతిప్పిన సినిమా అరుంథతి. ఈ సినిమా అనుష్క దశనే మార్చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే అనుష్కనే చేయాలి అనేంత గుర్తింపు సాధించింది.
బాహుబలి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్ధం… ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షక హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకుంది అనుష్క. కొంతకాలంగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ .. విజయాలు సాధిస్తుంది. అయితే.. బాహుబలి తర్వాత భారీ ఆఫర్స్ వచ్చినా ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఓకే చెప్పడం లేదు. ఈమధ్య కాలంలో మిస్ శెట్టి మిస్టర్ మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించింది.
ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన సినిమా ఘాటీ. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావాలి కానీ.. పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు జులై 11న ఘాటీ మూవీ రిలీజ్ కానుంది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుష్క క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఇతర పాత్రల్లో విక్రమ్ ప్రభు, చైతన్యరావు, జగపతిబాబు నటించారు. ఈ సినిమాతో పాటు అనుష్క మలయాళంలో కథనార్ – దివైల్డ్ సోర్సెరర్ అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానుంది. తాజాగా అనుష్క లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఖైదీ సీక్వెల్ లో నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కార్తీ హీరోగా నటించే ఈ సినిమాలో అనుష్క ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమౌతుందో లేదో చూడాలి.