
నీ ఇంటికొచ్చా..
నీ నట్టింటికొచ్చా..”
“కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా…”
“సౌండ్ చేయకు కంఠం కోసేస్తా”…అంటూ మాస్ డైలాగులతో అభిమానుల గుండెల్లో డైనమైట్లు పేల్చారు.

“ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్,
నేను ఒక్కడికి ఎదురెళ్లిన వాడికే రిస్క్..”
“చూడు ఒకవైపే చూడు, రెండోవైపు చూడాలనుకోకు..తట్టుకోలేవ్, మాడిపోతావ్”
“ఫ్లూట్ జింక ముందు ఊదు ‘సింహం’ ముందు కాదు” లాంటి పవర్ ఫుల్ డైలాగులతో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

“చరిత్ర మాది, సృష్టించాలన్నా మేమే, దానిని తిరగ రాయలన్నా మేమే…”
“వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్”
లాంటి పంచ్ లు వినాలంటే అది కచ్చితంగా ‘బాలయ్య’ అభిమానై ఉండాలి.
ఇలా మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన నటనతో అబ్బురపరిచారు. అంతేనా…
గతానికి, ప్రస్తుతానికి వెళ్లగల టైం మెషీన్ కాన్సెప్ట్ తో ‘ఆదిత్య 369’లో ద్విపాత్రాభినయం చేసి, 90’స్ లోనే థ్రిల్ కలిగేలా చేశారు.
తండ్రి వద్ద నటనలో ఓనమాలు దిద్ది,
తండ్రితో పాటు తెరను పంచుకొని,
తండ్రి నేర్పిన విలువల్నే పాటిస్తూ,
సోలోగా హీరో ఇమేజ్ తెచ్చుకొని,
‘యువరత్న’ నుంచి ‘నటసింహం’ అయ్యారు.
నాటి ‘మంగమ్మగారి మనవడు’తో తొలి విజయాన్ని అందుకొని, నేటికి ‘అఖండ2’ సినిమా టీజర్ తో అదరగొడుతున్నారు.
నటవారసుడిగా తండ్రి తర్వాత అంతటి స్థాయిలో పౌరాణిక, జానపద, సాంఘిక
పాత్రల్లో 100కుపైగా సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగారు.

గాడ్ ఆఫ్ మాసెస్.. నందమూరి బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపేందుకు సర్వం సిద్ధమైంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ2’ టీజర్ ఈరోజు విడుదలైంది. జూన్ 10న నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. టీజర్‌లోనే సినిమా ఎంత భారీగా ఉండబోతోందనే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అఘోరా గెటప్‌లో వున్న బాలయ్య.. గన్‌లతో ఉన్న ఎనిమిది మందిని తన త్రిశూలంపై మోసుకొని వస్తూ ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ థియేటర్స్‌లో విజిల్స్ పడేలా ఉంది.

టీజర్ చివరలో ‘వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది’ అంటూ ఎంతో డెప్త్‌తో ఉన్న డైలాగ్ ఉంటుంది. విజువల్‌గా ఈ సీన్‌ను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ‘అఖండ2’ తాండవంతో సెప్టెంబర్ 25న థియేటర్లు దద్దరిల్లిపోతాయనేది ఖాయమనిపిస్తుంది. ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి.