
దాసరి నారాయణరావు సప్తమ వర్ధంతి సందర్భంగా ప్రముఖ నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. దాసరి ప్రియ శిష్యులు – ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలో వంశీ రామరాజు, జైహింద్ గౌడ్, దర్శకుడు బాబ్జి, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు. నాగబాల సురేష్, వైజాగ్ శేషమాంబ తదితరులు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా అతిధులు, సన్మాన గ్రహీతలు దాసరితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకొని, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. సినిమా రంగానికి సంబంధించి అన్ని కీలక శాఖల్లోనే కాకుండా… రాజకీయాలు, పత్రికా రంగంలోనూ చెరగని ముద్ర వేసి, తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా భాసిల్లిన దాసరి పేరిట… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవార్డులు నెలకొల్పాలని ఈసందర్భంగా వారు పిలుపునిచ్చారు. వారసులు హీరోలుగా లేకున్నా… భౌతికంగా దూరమైనా… జయంతులు, వర్ధంతులు ఘనంగా జరుపుకోవడం దాసరికి మాత్రమే చెల్లిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణను అభినందించారు. తాను జీవించి ఉన్నంతవరకు… తన గురువు దాసరి, తన మిత్రుడు కోడి రామకృష్ణల జయంతులు – వర్ధంతులు క్రమం తప్పకుండా నిర్వహిస్తానని తుమ్మలపల్లి పేర్కొన్నారు!!