
మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, బన్నీ వాసు.. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించే సినిమాలకు అల్లు అరవింద్ సమర్పకుడు అయితే.. బన్నీ వాసు నిర్మాత. కథను ఎంచుకోవడం దగ్గర నుంచి రిలీజయ్యే వరకు అన్నీ తానై చూసుకుంటాడు. మంచి కథ అందించాలని తపిస్తుంటాడు. అలా ఒక కథను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో.. ఎలా ప్రమోట్ చేయాలో బన్నీ వాసుకు బాగా తెలుసు. ఇదిలా ఉంటే.. అల్లు అరవింద్, బన్నీ వాసు మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకనే బన్నీ వాసు కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఇది నిజమేనా..?
యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు అభిరుచి గల నిర్మాతగా మాంచి పేరుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో నిర్మాతగా రాణిస్తున్నారు. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించారు. 100% లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీత గోవిందం.. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాతో మరో సక్సెస్ సాధించారు. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన తండేల్ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించింది. బన్నీ వాసు తండేల్ సినిమా నాగచైతన్యకు ఫస్ట్ 100 కోట్ల సినిమా అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే తండేల్ 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీనిని బట్టి బన్నీ వాసు జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా బన్నీ వాసు.. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నుంచి బయటకు రాబోతున్నాడని.. వేరే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. అంతే కాకుండా.. ఇలా ప్రచారం మొదలైనప్పటి నుంచి అల్లు అరవింద్, బన్నీ వాసు మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకనే గీతా ఆర్ట్స్ నుంచి బయటకు రావాలి అనుకుంటున్నాడని టాక్ వినిపించింది. ఇదే విషయం గురించి బన్నీ వాసును అడిగితే.. తనకు నచ్చిన కొన్ని కథలు అల్లు అరవింద్ గార్కి నచ్చడం లేదని.. అందువలన కొన్ని కథలు తనకు నచ్చినప్పటికీ చేయలేకపోతున్నాను అని చెప్పారు బన్నీవాస్.
అందుకనే.. తనకు నచ్చిన కథలతో సినిమాలు చేసేందుకు ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ గార్కి చెప్పానని.. ఆయన అనుమతి తీసుకునే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాను అని చెప్పారు. సప్త అశ్వ క్రియేటివ్స్ మరియు హాయ్ నాన్న నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ కలిసి బన్నీ వాస్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాణ సంస్థ పేరు బన్నీ వాస్ వర్క్స్. ఈ సినిమాతో విజయేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రీ లుక్ అండ్ ఫస్ట్ లుక్ బాగుంది. యూత్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొత్తానికి తనకు నచ్చిన కథలతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసినట్టుగా బన్నీ వాస్ చెప్పారు. మరి.. ఈ సంస్థలో ఎలాంటి సినిమాలు వస్తాయో.. ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి.