చరణ్‌ తో దిల్ రాజు సినిమా ఫిక్స్… డైరెక్టర్ ఎవరంటే.?

Ram Charan & Dilraju Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ అనే సినిమా చేయడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడం తెలిసిందే. ప్రస్తుతం చరణ్‌ పెద్ది అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే.. దిల్ రాజు చరణ్‌ తో మరో సినిమా ప్లాన్ చేస్తుండడం అనేది ఆసక్తిగా మారింది. గేమ్ ఛేంజర్ తో చరణ్ కు సక్సెస్ ఇవ్వలేకపోయాడు.. ఇప్పుడు మరోసారి చరణ్‌ తో సినిమా అంటే.. ఎలా ఉండబోతోంది..? ఎప్పుడు స్టార్ట్ కానుంది.? దీని గురించి దిల్ రాజు ఏం చెప్పారు..?

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు అంతకు మించి అన్నట్టుగా ఏర్పడ్డాయి. అయితే.. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ ఏమాత్రం మెప్పించలేకపోయింది. నిర్మాతకు భారీగా నష్టాలు తీసుకువచ్చింది. ఇటీవల తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా చేయడం అనేది తన మిస్టేకే అని.. చరణ్‌ కి పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయామనే గిల్ట్ తనలో ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. Ram Charan & Dilraju Movie.

ఇప్పుడు తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో… రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించడం విశేషం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది అన్నారు. అంతే కాకుండా ఆల్రెడీ వర్క్ జరుగుతుందని.. ఈసారి చరణ్‌ తో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అందిస్తానని దిల్ రాజు చెప్పడంతో మెగా అభిమానుల్లో మరింతగా ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. దీంతో చరణ్, దిల్ రాజు కాంబోలో రూపొందే లేటెస్ట్ మూవీకి డైరెక్టర్ ఎవరు అనే క్యూరియాసిటీ మరింతగా పెరిగింది.

అయితే.. చరణ్‌ ఇప్పుడు పెద్ది అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తో సినిమా చేయాలి. అయితే.. సుకుమార్ కథ రెడీ చేయడానికి టైమ్ పడుతుందని.. అందుచేత సుకుమార్ సినిమా కంటే ముందుగా చరణ్‌ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని ఇటీవల అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు.. చరణ్ తో సినిమా చేస్తానని.. త్వరలో అనౌన్స్ మెంట్ వస్తుందని ప్రకటించడంతో గ్లోబల్ స్టార్ లైనప్ మారింది అనిపిస్తోంది. అయితే.. గేమ్ ఛేంజర్ గురించి శిరీష్‌ కామెంట్స్ చేయడం.. ఫ్యాన్స్ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే.. దిల్ రాజు బ్యానర్ లో చరణ్‌ మరో సినిమా చేస్తాడా అనే డౌట్ కూడా వస్తుంది. మరి.. చరణ్ కోసం దిల్ రాజు ఏ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతాడో.. అసలు చరణ్‌ డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/megastar-in-ustaad-bhagat-singh-sets-the-mega-brothers-are-shaking-up-the-social-media/