
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ఓ యంగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరిగింది. ఇటీవల ఈ యంగ్ డైరెక్టర్ తీసిన మూవీ హిట్ అవ్వడంతో ఈ కాంబో ఫిక్స్ అనుకున్నారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. నాగ్ తర్వాత వెంకీ పేరు వినిపించింది. వెంకీతో ఆ యంగ్ డైరెక్టర్ సినిమా ఖాయం అంటూ టాక్ వచ్చింది. ఇప్పుడు నాగ్ తోనూ కాకుండా.. వెంకీతోనూ కాకుండా.. ఓ యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నాడని.. ఈసారి ఈ యంగ్ డైరెక్టర్ రూటు మారుస్తున్నాడని తెలిసింది. ఇంతకీ.. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు..? యంగ్ హీరో ఎవరు..? రూటు మార్చి యంగ్ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడు..?
నాగార్జునతో సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారంలోకి వచ్చిన దర్శకుడు ఎవరంటే.. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 3 తర్వాత నాగ్ – శైలేష్ కొలను కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ గట్టిగా వినిపించింది. హిట్ 3 సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ కాంబోలో మూవీ కన్ ఫర్మ్ అంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే.. అదేమీ జరగలేదు. ఇదే విషయం గురించి శైలేష్ ను అడిగితే.. నాగార్జున అంటే ఇష్టమని.. ఆయనతో సినిమా చేయాలనివుందన్నాడు కానీ.. ఇప్పుడు అయితే మాత్రం కథ ఏమీ చెప్పలేదన్నాడు.
అయితే.. వెంకటేష్ తో సినిమా చేయాలనివుందన్నాడు. గతంలో ఆయనతో తెరకెక్కించిన సైంధవ్ సినిమా ఆడలేదు. మంచి అవకాశం ఇస్తే.. సక్సెస్ ఇవ్వాలేకపోయాననే బాధ ఉందని.. ఆయనతో ఇప్పుడు మాంచి ఎంటర్ టైనర్ చేయాలని వుందన్నాడు శైలేష్. స్వయంగా శైలేషే వెంకీతో సినిమా చేయాలని ఉందని.. ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నానని చెప్పడంతో ఈ కాంబో మళ్లీ రిపీట్ కానుందని వార్తలు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మాంచి ఎంటర్ టైనర్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి.. శైలేష్ తో వెంకీ సినిమా ఉండచ్చు అనుకున్నారు కానీ.. వెంకీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు.
శైలేష్ సినిమా నాగ్, వెంకీ ఇద్దరితో కాదు.. మరి ఎవరితో అంటే.. యంగ్ హీరో రోషన్ తో అని సమాచారం. నిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన శ్రీకాంత్ తనయుడు రోషన్.. ఆతర్వాత పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ సాధించాడు. అయితే.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే.. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రోషన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి వృషభ కాగా, రెండోది ఛాంపియన్. ఇప్పుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలిసింది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించనున్నారు. మరి.. రూటు మార్చి ఏం చేయబోతున్నాడంటే.. ఇప్పటి వరకు సీరియస్ సినిమాలు చేసిన శైలేష్ ఇప్పుడు రోషన్ తో లవ్ స్టోరీ చేయబోతున్నాడని సమాచారం.