
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడం తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వడం ఆనందించాల్సిన విషయం. దిల్ రాజు సారధ్యంలో కమిటీలు వేసి అవార్డులను ఎంపిక చేశారు. 2014 నుంచి 2024 వరకు అంటే పదేళ్లకు ప్రతి సంవత్సరానికి మూడు ఉత్తమ సినిమాలను ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం అయినా.. కేంద్ర ప్రభుత్వం అయినా.. అవార్డులు ప్రకటించినప్పుడు విమర్శలు రావడం సహజం. ఇప్పుడు గద్దర్ అవార్డులకు వ్యతిరేకంగా మాట్లాడితే బాగోదనే ఉద్దేశ్యంతో ఎవరూ మాట్లాడడం లేదు కానీ.. చాలా మందికి అసంతృప్తి ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గద్దర్ కమిటీకి మనం సినిమా కనపడలేదా..? అనే విమర్శలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమాలకు కూడా అన్యాయం జరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు కారణం ఏంటి..?
మనం సినిమా ఓ సంచలనం. నాటికి, నేటికే కాదు.. ఎనాటికైనా అదో అద్భుతమైన చిత్రం. అందులో ఎలాంటి సందేహం లేదు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రం. అక్కినేనితో పాటు ఫ్యామిలీ హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన సినిమా అది. ఈ సినిమా అక్కినేని కుటుంబానికే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో మరచిపోలేని చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్ లో.. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఘనత అక్కినేని హీరోలకే దక్కింది. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ ఒక్క చిత్రానికే నిర్మాతగా నాగార్జున పేరు వేసుకోకుండా అక్కినేని కుటుంబం అని టైటిల్స్ లో వేయడం విశేషం.
ఇక అసలు విషయానికి వస్తే.. మనం సినిమా 2014లో మే 23న విడుదలైంది. ఆ సంవత్సరంలో ఉత్తమ చిత్రాలుగా రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శీను చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అదే సంవత్సరం మే 23న రిలీజైన మనం సినిమాకు ఎందుకు అవార్డ్ ఇవ్వలేదంటే.. సెన్సార్ డేట్ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని.. తెలంగాణ ఏర్పాటు తేదీకి అనుగుణంగా కటాఫ్ డేట్ ఫిక్స్ చేయడం వలన మనం సినిమా జాబితాలోకి రాలేదని చెబుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రమది. ఈరోజు హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందంటే.. ఇంతలా అభివృద్ది చెందింది అంటే.. ఆయనే కారణం. మొదటి అడుగు వేసింది అక్కినేని. గ్రేట్ యాక్టర్ మాత్రమే కాదు.. గ్రేట్ విజనరీ.
నాతో సినిమా చేయాలంటే.. హైదరాబాద్ రండి.. నేను హైదరాబాద్లోలోనే ఉంటాను.. అక్కడైతేనే సినిమా చే్స్తానని పట్టుబట్టిన వ్యక్తి. ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి మొదటి అడుగు వేసిన మహానుభావుడు. ఆయనకు అవార్డులు కొత్త కాదు.. ఆయనకు అవార్డ్ ఇవ్వడం వలన గద్దర్ అవార్డులకే పేరు వచ్చేది. కమిటీ లెక్కల ప్రకారం జాబితాలోకి రాకపోయినా.. తెలుగు సినిమాకి, హైదరాబాద్ కి ఇండస్ట్రీ తరలి రావడానికి ప్రధాన కారణమైన అక్కినేనికి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఇస్తే.. మనం సినిమాకి స్పెషల్ అవార్డ్ ఇస్తే.. ఎంతో బాగుండేదనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. అసలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన దసరా సినిమాకి అవార్డ్ రాకపోవడం ఏంటో వారికే తెలియాలి. ఆ సినిమాలో నాని నటనకు అవార్డ్ ఇవ్వచ్చు.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు అవార్డ్ ఇవ్వచ్చు. అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్ తోనే రూపొందిన విరాటపర్వం సినిమాకు కూడా అవార్డ్ దక్కలేదు. స్పెషల్ జ్యూరీ అవార్డ్ అంటూ తమిళ డైరెక్టర్ మణిరత్నంకు అవార్డ్ ఇచ్చారు. త్రివిక్రమ్, రాజమౌళికి అవార్డ్ ఇవ్వలేదు. ఏదో వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ అవార్డుల గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. మరి.. జ్యూరీ సభ్యులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.