
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. అందుకనే నాగ్ ని ప్రయోగాల సర్థార్ అంటారు. తండ్రి బాటలోనే.. చైతూ కూడా ప్రయోగాలు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగ్ నట ప్రస్థానంలో.. 100 అనే మైలురాయికి చేరుకున్నాడు. ఎప్పటి నుంచో వందో సినిమా గురించి ఊరిస్తూ వస్తున్న నాగార్జున ఇప్పుడు మాత్రం 100వ సినిమా గురించి అంతా ఫిక్స్ చేశారనే ఎక్స్ క్లూజీవ్ న్యూస్ తెలిసింది. అయితే.. నాగ్ 100వ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం పై అభిమానుల్లో అసంతృప్తి ఉంది. చైతూ నిర్ణయాల పైన కూడా అభిమానుల్లో అసంతృప్తి ఉంది. ఇంతకీ.. అభిమానులకి అసంతృప్తి కలిగించిన నాగ్, చైతూ నిర్ణయాలు ఏంటి..?
నాగార్జున కెరీర్ లో మైలురాయిలా నిలిచే 100వ సినిమాని స్టార్ డైరెక్టర్ తో చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక. నాగ్ సెంచరీ మూవీని స్టార్ డైరెక్టర్ తో చేస్తే.. వచ్చే క్రేజ్ కానీ.. బజ్ కానీ.. ఓపెనింగ్ కానీ.. వేరే లెవల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే.. నాగ్ మాత్రం 100వ సినిమాను తమిళ డైరెక్టర్ కార్తీక్ తో చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ వార్త నిజమో కాదో అనే డౌట్ ఉండేది. ఇప్పుడు ఈ సినిమా ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
అయితే.. ఆ నలుగురు సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. ఈ ముగ్గురు హీరోలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. నాగార్జున నుంచి సరైన బ్లాక్ బస్టర్ రావాలని అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనేమో కుబేర, కూలీ అంటూ వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. కనీసం వందో సినిమా అయినా స్టార్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తారనుకుంటే.. కార్తీక్ అనే తమిళ దర్శకుడితో చేయడానికి ప్లాన్ చేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. నాగ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చైతన్య విషయానికి వస్తే.. తన తోటి స్టార్స్ వరుసగా మూడు నాలుగు ప్రాజెక్టులు లైనలో పెడుతుంటే.. ఈయన మాత్రం ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్టుగా చేస్తున్నాడు. అది కూడా స్టార్ డైరెక్టర్స్ తో ప్లాన్ చేయకుండా.. ఒకటి రెండు సినిమాలు తీసిన ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తుండడంతో అభిమానులు బాగా ఫీలవుతున్నారు. తండేల్ తో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత విరూపాక్ష అనే ఒకే ఒక్క హిట్ సినిమా తీసిన కార్తీక్ దండుతో చైతన్య సినిమా చేస్తున్నాడు. తర్వాత సినిమా ఎవరితో అంటే క్లారిటీ లేదు. ఇలా చైతూ కెరీర్ ప్లానింగ్ సరిగా లేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అఖిల్ విషయం కూడా అంతే. స్పీడుగా సినిమాలు చేస్తాడనుకుంటే.. సినిమా సినిమాకి గ్యాప్ బాగా తీసుకుంటున్నాడు. మరి.. అక్కినేని హీరోలు అభిమానులకు నచ్చేలా ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.