
Game of Change నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్రలో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్’. సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ రోజు ఈ మూవీని మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత, కథానాయకుడు సిద్ధార్థ్ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘సినిమా రంగంపై ఉన్న మక్కువతో నిర్మాతగా, నటుడిగా ఈ చిత్రంతో మీ ముందుకు వచ్చాను. ‘గేమ్ ఆఫ్ చేంజ్’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం అని నమ్ముతున్నాను. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన కొన్ని నిజ జీవితాల కథనాలతో ఈ చిత్రం రూపొందించాము. నాలుగు భాషల్లో డబ్బింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అందరికీ ఈ సినిమా నచ్చేలా ఉంటుంది. మా మూవీ ప్రతి ప్రేక్షకుడిలో స్ఫూర్తి నింపుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఎందుకు జీవితంలో సాధించలేము అనే పట్టుదల మొదలవుతుంది. కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం జీవితంలో ఎదుగుతామని చెప్పే చిత్రమిది. ఈ సినిమాతో ఫిలింమేకింగ్ ఎంత కష్టమో తెలిసింది. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీగా రివల్యూషన్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాం.” అన్నారు.
మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశాం. నేను మార్కెటింగ్ విభాగంలో 2 వేలకు పైగా సినిమాలకు పనిచేశాను. గేమ్ ఆఫ్ ఛేంజ్‌తో ప్రొడ్యూసర్‌గా పనిచేసే అవకాశాన్ని సిద్ధార్థ్ రాజశేఖర్ కల్పించారు. సినిమా అంటే ఎంత హంగామా, ఎంత ఖర్చుతో కూడుకున్నదో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో థియేటర్స్‌కు ప్రేక్షకుల్ని రప్పించడం ఎంత కష్టమో మనకు తెలుసు. దేశవ్యాప్తంగా మేము ప్రమోషన్ చేస్తున్నాం. త్వరలోనే మా చిత్రాన్ని థియేట్రికల్, ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయి.” అన్నారు. Game of Change