హ్యాపీ బ‌ర్త్ డే టు బాల‌య్య బాబు..! బాలయ్య బర్త్ డే స్పెషల్..!

‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజూ.. ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం, ముక్కుసూటిగా జవాబివ్వడం ఆయన నైజం. ఆ ఆటిట్యూడే సినిమాల్లో ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.

  • 1960 జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవతారకమ్మ గార్ల దంపతులకు చెన్నైలో జన్మించారు. చిన్ననాటి నుంచే నాన్న సినిమాలు చూస్తూ పెరిగారు. ఇంటర్ వరకు మద్రాసులోనే చదివారు. హైదరాబాద్ వచ్చాక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
  • 1976లో ‘తాతమ్మ కల’ సినిమాతో 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. ‘దానవీర శూరకర్ణ’లో అభిమన్యుడిగా, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’లో సలీమ్ గా, రాం రహీమ్ రాబర్ట్, అన్నదమ్ముల అనుబంధం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లాంటి సినిమాల్లో తండ్రితో కలిసి నటించే అవకాశం దక్కింది.
  • 1982లో బాలకృష్ణకు, వసుంధర దేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు.
  • 1984లో ‘మంగమ్మగారి మనవడు’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. ఆయన కెరీర్ లోనే మైలురాయి ఈ సినిమాగా చెప్పవచ్చు. అప్పటివరకు నందమూరి వారసుడిగానే ఆదరించారు. అటు పిమ్మట ఒకే సంవత్సరంలో 6 నుంచి 7 సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. అందులోనూ 6 హిట్లు సాధించిన ఘనత ఒక్క బాలకృష్ణకే దక్కింది.
  • 1991లో వచ్చిన ‘ఆదిత్య 369’ ఒక ప్రయోగమనే చెప్పాలి. ఈ సినిమాలో గతంలో శ్రీకృష్ణదేవరాయలుగా, ప్రస్తుతంలో ఉండే కృష్ణకుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ కూడా హిట్ అయ్యింది.
  • 1994లో ‘భైరవద్వీపం’ జానపద నేపథ్యంలో తెరకెక్కింది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఫీల్ అందించింది. కథకు తోడు సరికొత్త గ్రాఫిక్స్, కత్తి విన్యాసాలు ఈ సినిమాను సూపర్‌ హిట్‌ చేశాయి. బాలకృష్ణ కెరీర్‌లో భైరవద్వీపం ‘వన్‌ ఆఫ్ ది స్పెషల్ మూవీ’.
  • 1997లో ‘పెదన్నయ్య’ బాగా సక్సెస్ అయ్యింది.
  • 1999లో ‘సమర సింహరెడ్డి’, 2001లో ‘నరసింహనాయుడు’, 2002లో ‘చెన్నకేశవరెడ్డి’లతో బాక్సాఫీస్ హిట్ కొట్టడమేకాక ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా మారారు.

ఒకదశలో చిరంజీవి సినిమాలకు, బాలకృష్ణ సినిమాలకు మధ్య విపరీతమైన పోటీ ఉండేది. అభిమానుల మధ్య ఫ్యాన్ గొడవలు జరిగేవి. ఆ తర్వాత 2004- 09ల మధ్య వచ్చిన విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారధి, ఒక్కమగాడు, మిత్రుడు, పాండు రంగడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఆయన గ్రాఫ్ కూడా తగ్గింది.

  • 2010లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’లో ఆయన నటవిశ్వరూపం చూపించారు. ఈ సినిమాతో తిరిగి మంచి సక్సెస్ అందుకున్నారు.
  • 2011లో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ అలనాటి కళాఖండం లవకుశకు రీమేక్‌గా తెరకెక్కింది. భారీ వ్యయంతో బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీప్రేక్షకులకు మధురానుభూతిని అందించింది. ఇక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు.
  • 2012లో అధినాయకుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, శ్రీమన్నారాయణ తీశారు. అవి ప్లాఫ్ అయ్యాయి.
  • 2014లో మళ్ళీ బోయపాటి దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ‘లెజెండ్’ తీసి, హిట్ కొట్టారు.
  • 2015, 16లో వచ్చిన ‘లయన్’, ‘డిక్టేటర్’లు యావరేజ్ టాక్ తెచుకున్నాయి.
  • 2017లో 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక అంశంతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేసి, మరో విజయం అందుకున్నారు. తర్వాత వచ్చిన ‘పైసా వసూల్’ నిరాశపర్చినా, 2018లో ‘జై సింహా’ హిట్ అందుకుంది.
  • 2019లో ఆయన తండ్రి నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ సినిమా తెరకెక్కింది.
  • 2021లో బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం `అఖండ‌1’ హిట్ గా నిలిచింది.
  • మళ్ళీ 2025లో, ఈ ఏడాదిలో అఖండ2 రిలీజ్ కానుండగా.. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

అవార్డులు..

  • 1994లో భైరవద్వీపం చిత్రానికిగాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.
  • ’నరసింహ నాయుడు’, ‘సింహా’ చిత్రాలకుగానూ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు లభించింది.
  • ‘నరసింహనాయుడు’ చిత్రానికి సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు,
  • సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు ఉత్తమ నటుడిగా, పాండురంగడు సినిమాకు భరతముని అవార్డులు వచ్చాయి.
  • ‘లెజెండ్’ చిత్రానికి 2014లో ఉత్తమ కథనాయకునిగా SICA అవార్డు వరించింది.
  • 2014లో టీడీపీ తరఫున హిందూపురంలో ఎమ్మెల్యేగా పోటీచేసి 16వేల అధిక్యంతో గెలుపొందారు. మరలా 2019లో రెండోసారి కూడా గెలిచి అదే పదవిలో కొనసాగుతున్నారు.
  • 2025లో పద్మ భూషణ్ గ్రహీత, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు గద్దర్ అవార్డు అందుకోనున్నారు.

తన తల్లి బసవతారకమ్మ క్యాన్సర్ వల్ల చనిపోవడంతో, ఆమె జ్ఞాపకార్ధం 1988లో ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి’ని తన తండ్రి నిర్మించారు. ఆ తర్వాత నుంచి ఆ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు బాలకృష్ణగారు చేపట్టి, ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంతో సెంచ‌రీ సాధించిన బాల‌య్య ఆత‌ర్వాత నుంచి మ‌రెంత‌గా స్పీడు పెంచారు. అలాగే ఇప్పుడు యంగ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ 2 లో నటిస్తున్నారు. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈమూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ సినిమా పై అమాంతం అంచనాలు పెంచేసింది. ఈ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఇలా.. వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్న బాలకృష్ణ మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తుంది మెగా 9 టీమ్.