
Hari Hara Veeramallu Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని ఈ నెల 24న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ కు ఇరవై రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. అయితే.. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత వీరమల్లు మరో చావా కానుందనే టాక్ వినిపిస్తోంది. నిజంగానే వీరమల్లు మరో చావా కానుందా..? అసలు అంతలా.. వీరమల్లులో ఏముంది..?

పవన్ కళ్యాణ్ వీరమల్లు ట్రైలర్ లో మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు. ఢిల్లీ సుల్తానులు నుండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి నడుం బిగించిన యోధుడు, మొఘల్ శక్తిని ధిక్కరించిన వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత అపఖ్యాతి పాలైన పాలకులలో ఒకరైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు. కోహినూర్ వజ్రం కోసం పోరాటం, మొఘలులతో వీరమల్లు తలపడటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

గంభీరమైన రూపాన్ని కనబరుస్తూ, సనాతన ధర్మం పట్ల మక్కువను వ్యక్తపరుస్తూ.. భయమనేది ఎరుగని వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు నభూతో నభవిష్యత్. వీరమల్లు పాత్ర కోసం తనని తాను మలచుకున్న తీరు అమోఘం. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ మరింతగా ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన అభినయం, ఆహార్యంతో వీరమల్లు పాత్రకు ప్రాణం పోశారు. అయితే.. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. ఇటీవల చావా రిలీజైంది. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ గురించి ఇంత వరకు ఎవరికీ తెలియదు. చావా వచ్చిన తర్వాతే తెలిసింది. అలాగే చావా సినిమా చూసి చాలా మంది ఏడ్చారు. అంతలా ఆ సినిమా కనెక్ట్ అయ్యింది. వీరమల్లు సినిమా కమర్షియల్ సినిమా. అయినప్పటికీ.. అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు. Hari Hara Veeramallu Trailer.

ఈ మూవీ ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు చూశారట. దీనిని బట్టి ఈ ట్రైలర్ ఆయనకు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డెవోషనల్ ట్రెండ్ నడుస్తుంది. మన ధర్మం గురించిన కథతో సినిమా చేస్తే.. ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ఆదరిస్తారు. సినిమాకి మంచి విజయాన్ని అందిస్తారు. అందుచేత వీరమల్లు మరో చావా అయ్చే ఛాన్స్ ఉంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.