
స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో జరిగిన సిబిజె కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నిర్మాత ఆర్వీ రమణమూర్తి ఆశయ సాధన అహర్నిశలు శ్రమిస్తున్న భువన రాయవరపు సారధ్యంలో నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ప్రత్యేకంగా రియల్ హీరోస్ ని సత్కరించి ఎన్టీఆర్ దేశ్ రక్షక్ అవార్డులను త్రివిధ దళాలకు చెందిన సైనిక అధికారులకు అందజేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన సైనిక అధికారులకు పురస్కారాల ప్రదానం జరిగింది. మేజర్ జనరల్ ఎన్ ఎస్ రావు, మేజర్ భరత్, గ్రూప్ కెప్టెన్ పి ఆర్ ప్రసాద్, కెప్టెన్ టి ఎన్ సాయికుమార్ లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ దేశ రక్షక్ అవార్డులను విశిష్ట అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే కళావేదిక సంస్థ అందిస్తున్న ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను సీనియర్ నిర్మాతలు ఎన్ఆర్ అనురాధ, చదలవాడ శ్రీనివాసరావు అందుకున్నారు. ఈ సందర్భంగా కళావేదిక సంస్థ రూపొందించిన నట సార్వభౌముడు ప్రత్యేక సంచికను అతిధుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటుడికి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని పేద రైతు కుటుంబంలో నుంచి వచ్చి ప్రపంచంలో అద్వితీయ నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానంలో నిలబడటం అరుదైన విషయమని ఆయన అన్నారు. సినీ నటుడుగా ఉన్నప్పుడే ఆయన ప్రజల కోసం తపన పడి యావత్ ప్రజలను ఒక తాటిపై నిలిపి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అన్నారు. కరువు వచ్చిన.. తుఫాను వచ్చినా.. యుద్ధం వచ్చిన తనతో పాటు ప్రజలను కదిలించి నిధులు సేకరించి ప్రభుత్వానికి అందజేసిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన అన్నారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సంక్షేమ పథకాల రూపకర్త ఎన్టీఆరే అని కొనియాడారు. అలాంటి మహానుభావుడికి నివాళిగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం, రియల్ హీరోస్ అయినా సైనికాధికారులు సత్కరించడం మామూలు విషయం కాదని కళావేదిక నిర్వాహకురాలు భువన రాయవరపు అభినందనీయురాలని ప్రశంసించారు.
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. సైనిక అధికారులను సత్కరించాలన్న ఆలోచన చాలా గొప్పదని, అలాంటి గొప్ప కార్యక్రమం చేసిన ఆర్వీఆర్ తనయ భువన ఒక గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని అభినందించారు. ఈరోజు ప్రస్తావిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ఆరోజే పాతాళభైరవి తో ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని వరుస మూడు హిందీ చిత్రాలు విడుదల తర్వాత హిందీలో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి వాటన్నిటిని సున్నితంగా తిరస్కరించి తెలుగు చిత్రాలకే పరిమితమై తెలుగుపై మమకారాన్ని చాటిని గొప్ప వ్యక్తే ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. అలాగే దేశంలో అత్యధిక పారితోషకాన్ని తొలిసారి అందుకున్న సార్వభౌముడు ఆయనేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారాన్ని చేపట్టే విధంగా ఫెడరల్ ఫ్రంట్ కు రూపకల్పన చేసి ముందుకు నడిపిన ఘనత ఆ మహనీయునిదేనని ఆయన అన్నారు. అలాంటి మహానుభావులకు జననమే గాని మరణం ఉండదని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు మద్రాసిగా పిలవబడే తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన మహానటుడు, నాయకుడు శ్రీ ఎన్టీఆర్ అన్నారు హైదరాబాదు లో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రాంతంలో 95శాతం సీట్లు వస్తే తెలంగాణలో నూటికి నూరు శాతం సీట్లు సాధించిందని తెలిపారు. రామారావు గారి వల్లే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ఒక గొప్ప గుర్తింపు లభించిందని ఈరోజు ఆయన పేరు మీదుగా పురస్కారాలను ప్రతిభ గలవారికి అందజేయడం చాలా గొప్ప విషయం అన్నారు.
నటుడు మాదాల రవి తన ప్రసంగంలో ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచిపోకుండా సేవలతో రాజకీయాల ద్వారా ప్రజలకు చేరువైన ఏకైక నటుడు అని కొనియాడారు. బడుగు బలహీన తాడిత పీడిత జనాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఆయన అన్నారు.