చైతూ, రవితేజతో ప్లాన్ చేస్తే.. నితిన్ తో ఫిక్స్ అయ్యిందా..?

అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయాలని ఓ డైరెక్టర్ స్టోరీ రెడీ చేశాడు. స్టోరీ లైన్ తో మెప్పించిన ఆ డైరెక్టర్ ఫుల్ స్టోరీతో మాత్రం ఒప్పించలేకపోయాడు. ఆతర్వాత మాస్ మహారాజా రవితేజతో మూవీ సెట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ లేదు కానీ.. నితిన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఓ కొత్త కబురు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? నితిన్ తో మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

నాగచైతన్య కోసం కథ రాసిన డైరెక్టర్ ఎవరో కాదు.. కిషోర్ తిరుమల. నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి, చిత్రలహరి, ఆడాళ్లు మీకు జోహార్లు తదితర చిత్రాలను తెరకెక్కించి ఫీల్ గుడ్ స్టోరీస్ ను బాగా డీల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు కిషోర్ తిరుమల. అయితే.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి కొత్త సినిమా వచ్చి చాన్నాళ్లు అయ్యింది. ఆమధ్య నాగచైతన్యతో సినిమా చేయడం కోసం ఓ కథ రెడీ చేశాడు. కథ విని చైతూ.. స్టోరీ లైన్ బాగుంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే.. ఫుల్ స్క్ర్రిప్ట్ తో మాత్రం కిషోర్ తిరుమల మెప్పించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

నాగ చైతన్యతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడం కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపించింది. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ సినిమా గురించి అప్ డేట్ రాలేదు కానీ.. నితిన్ తో సినిమా చేయడం కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసింది. నితిన్ వరుస ప్లాపులతో కెరీర్ లో బాగా వెనబడ్డాడు. తమ్ముడు సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. దీని తర్వాత బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడు. అలాగే విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అయితే.. కిషోర్ తిరుమలతో సినిమా ఓకే చేసినా సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పడుతుంది. మరి.. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్, కిషోర్ తిరుమల ఇద్దరూ మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.