
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందిన చిత్రం దేవర. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా సక్సెస్ సాధించింది. నార్త్ లో ఈ మూవీకి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రావడం విశేషం. అయితే.. ఈ సినిమా కథ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో దేవర పార్ట్ 2 ఉండదు అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఇటీవల దేవర పార్ట్ 2 ఉంటుందని స్వయంగా ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ ఫిక్స్ అయ్యింది. దీంతో దేవర 2 ఉందా..? లేదా..? అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. అసలు ఎన్టీఆర్ ప్లానింగ్ ఏంటి..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ మూవీ షూటింగ్ పూర్తి చేసారు. ఈ క్రేజీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న డ్రాగన్ మూవీని 2026 జనవరిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే టైమ్ లో విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ వస్తుండడంతో డ్రాగన్ మూవీని జూన్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల ఎన్టీఆర్ పై ఈ మూవీ కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టుగా టాక్ వినిపించింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించేందుకు నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వార్ 2, డ్రాగన్ కంప్లీట్ చేసిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా, కొరటాల డైరెక్షన్ లో.. దేవర 2 ఈ రెండు సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యింది.
దీంతో డ్రాగన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో దేవర 2 స్టార్ట్ చేస్తాడా..? త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీని సెట్స్ పైకి తీసుకువస్తాడా..? అసలు దేవర 2 నిజంగా ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. 2026లో ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత 2027లో ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ, 2028లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రచారంలో ఉన్న వార్తలను బట్టి చూస్తుంటే.. దేవర 2 లేనట్టనే అని.. ఒకవేళ ఈ సినిమా ఉన్నా.. ఇప్పట్లో ఉండకపోవచ్చు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పాపం.. కొరటాల మాత్రం దేవర 2 చేయాలని కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నాడు. మరి.. ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో.. ఎప్పుడు దేవర 2 చేస్తాడో.. త్వరలో కొరటాలకు అయినా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.